నరసరావుపేట రూరల్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న ఎల్‌నినో ప్రభావాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సమర్ధంగా ఎదుర్కోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. రైతు సాధికార సంస్ధ ఆద్వర్యంలో ఐసీఆర్‌పీలు, ఎఫ్‌ఎంలు, డీఎంఎంటీలకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారావు మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వలన ఏర్పడే పరిస్థితులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై విస్త్రృత అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాల్లోని రైతులందరినీ ఎస్‌టూఎస్ రైతులుగా మార్చే దిశగా కృషిచేయాలని సూచించారు. జిల్లాలోని 28 మండలాల్లో రైతు సేవవా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విత్తన గుళికల పద్ధతిని అనుసరించడం ద్వారా విత్తనాలు చెడిపోకుండా, వర్షం పడగానే మొలకెత్తేలా చేయవచ్చని తెలిపారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండే విధంగా పంటల నిర్వహణ చేయడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చన్నారు. రాష్ట్ర ఎన్‌ఎఫ్‌ఏ మల్లేశ్వరి, సైదయ్య, అప్పలరాజు, సౌజన్య, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.
– జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు


