నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఘటన అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ఆదివారం రాత్రి నకరికల్లు వద్ద జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. చల్లగుండ్ల గ్రామానికి చెందిన పాలపాటి వీరాంజనేయులు (38) నకరికల్లులో బార్బర్ షాపు నిర్వహిస్తుంటాడు. ఆదివారం రాత్రి ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ సమీపంలోని డివైడర్ వద్ద పిడుగురాళ్ల వైపు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు, అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.సతీష్ తెలిపారు.
వెల్దుర్తి: మండలంలోని మిట్టమీదిపల్లె గ్రామానికి చెందిన మడతల శ్రీనివాసరెడ్డి (42) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. శ్రీనివాసరెడ్డి ఎద్దుల కొనుగోలు నిమిత్తం మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం కవలకుంట ప్రాంతానికి వెళ్లిన సమయంలో అక్కడ వర్షం పడుతుండగా చెట్టుకింద నిలబడి మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలున్నారు.
మాచర్ల: సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో ఆమె తండ్రి కామనబోయిన చంద్రశ్రీను, మేనమామ పచ్చిపాళ్ల శ్రీనులను సోమవారం రాత్రి గురజాల ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణ అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన చంద్ర శ్రీను కుమార్తె ప్రేమించిన నాగరాజుతో వెళ్లి వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించి చౌడేశ్వరి అదృశ్యమైనట్లు, దానికి కారణం జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజు అని మృతురాలి తల్లిదండ్రులు చంద్రశ్రీను, గంగమ్మలు పోలీసులను ఆశ్రయించారు. ఆ తరువాత ఈ నెల 18న చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పారు. అయితే ఇది హత్య కేసుగా పోలీసు పరిశోధనలో తేల్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య కేసులో నిందితులు చంద్రశ్రీను, పచ్చిపాళ్ల శ్రీనులను అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అర్థరాత్రి హాజరుపర్చనున్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: అరండల్‌పేట 12/3లోని వావిలాల సంస్థ గ్రంథాలయ శాస్త్ర పాఠశాల ఆధ్వర్యంలో గ్రంథాలయశాస్త్ర సర్టిఫికెట్ కోర్సు(సీఎల్‌ఐఎస్)లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపాల్ డి.రాంబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి 18 ఏళ్ల వయసు నిండిన అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో కోర్సులను ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు. వివరాలకు సంస్థ కార్యాలయంతో పాటు 0863–2237375, 93962 38946 నంబర్లో సంప్రదించాలని కోరారు.
భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో మంగళవారం ఉదయం 9 గంటలకు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సాతులూరి వెంకట రమణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
కారంచేడు: వేగంగా బైక్ నడిపి రోడ్డు పక్కన నిలబడి ఉన్న మహిళను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలకు కారణమైన నిందితుడికి సోమవారం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని దగ్గుబాడు సమీపంలోని కోల్డు స్టోరేజ్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఎం చినవెంకటేశు భార్య 24 జనవరి 2020 రాత్రి ప్రధాన రహదారి మార్జిన్‌లో నిలబడి ఉంది. ఈక్రమంలో జే పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామానికి చెందిన మున్నంగి చంటి వేగంగా బైక్ నడుపుకుంటూ మహిళను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆమెను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సాక్షులను ప్రవేశపెట్డడంలో ప్రతిభను చూపిన ఎస్‌ఐ, కోర్టు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. పర్చూరు కోర్టు నిందుతుడికి ఏడాది జైలు శిక్షను విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


