జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు 59 ఫిర్యాదులు స్వీకరణ
నరసరావుపేట రూరల్: భూ వివాదాలు, ఆర్థిక వ్యవహారాలపై పీజీఆర్‌ఎస్‌లో అధిక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి అంశాలపై 59 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ తెలిపారు. క్షేత్ర స్థాయిలో విచారణ వేగవంతం చేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని సూచించారు.
పూర్వికుల నుంచి వచ్చిన భూమి మాకు 70 సెంట్లు ఉంది. పది సెంట్లు భూమిని కపిలవాయి సుబ్బారావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిపై న్యాయస్థానం నుంచి కూడా తీర్పు వచ్చినా ధిక్కరించి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. సుబ్బారావుపై చర్యలు తీసుకుని మా స్థలంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి.
–మారుగండ్ల వెంకయ్య, దుర్గి
నా తండ్రికి ఐదుగురు ఆడపిల్లలు. నాకు కూడా ఆడపిల్లలే పుడతారని భర్త వదిలి వెళ్లిపోయాడు. ఐదు సంవత్సరాల క్రితం వివాహం కాగా ఏప్రిల్ నెలలో తమకు పాప పుట్టిందని తెలిపింది. పాప కడుపులో ఉండగానే భర్త తమను వదిలి వెళ్లిపోయాడు. తమకు న్యాయం చేయాలని కోరింది.
–ఓ మహిళ, మునుగోడు,
అమరావతి మండలం
ఇంటి నిర్మాణం కోసం గుంటూరు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఈశ్వరాచారిని 2025లో సంప్రదించాను. అవసరమైన రుణం రూ.5.50 లక్షలు మంజూరు చేయించాడు. ఇందులో రూ.3 లక్షలు మాకు ఇచ్చాడు. మిగిలిన మొత్తం రిజిస్ట్రర్ ఖర్చు కమిషన్ పేరుతో తీసుకున్నట్టు వివరించాడు. దీనిపై ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.
– ఎలిజల ఏసుదానం, నరమాలపాడు,
కారంపూడి మండలం


