సత్తెనపల్లి: ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి రాజధానికి చట్టబద్ధత తీర్మానం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరలేపారని వైఎస్సార్ సీపీ మీడియా ప్యానలిస్ట్, పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డి విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పారు. చంద్రబాబు 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే మరెవరో వచ్చి మార్చేస్తారని ప్రచారం ఎందుకు చేబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తనపై తనకే నమ్మకం లేదు అనడానికి సంకేతమన్నారు. అమరావతిలో ఇంతవరకు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని, కేవలం డిజైన్ల పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. 2014–19 టీడీపీ హయాంలో కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. కూటమి ప్రభుత్వం లక్ష ఎకరాల భూమిని సేకరించడం వెనుక అనుచరులు, బినామీలకు లబ్ధి చేకూర్చే రియల్ ఎస్టేట్ దందా ఉందని ఆరోపించారు. ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ. 2 కోట్లు అవసరమని, మొత్తం ప్రాజెక్టుకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని.. అంత భారం భరించే శక్తి రాష్ట్రానికి ఉందా అని నిలదీశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. రెండో విడత భూసేకరణ కోసం సీఎం చంద్రబాబు తీర్మానం డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ తీర్మానాల్లో, పార్లమెంటు ఉభయసభల్లో అమరావతి బిల్లును వ్యతిరేకించలేదని వివరించారు. బిల్లు స్వరూపాన్ని తప్పుపట్టారన్నారు.
మావిగన్‌పై పచ్చ మీడియా..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుత ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు హైవే కారిడార్ రాజధానిగా చేస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక వనరుల వెతుకులాట పని లేకుండా సమకూరుతాయని మావిగన్ అనే ప్రతిపాదన చేశాడే తప్ప ఆ ప్రతిపాదనలో సాధ్యసాధ్యాలు ఆలోచించకుండా టీడీపీ తద్వారా పచ్చ మీడియా, పత్రికలు నోటికొచ్చినట్లు మాట్లాడటం, దూషించడం సరైనది కాదన్నారు. చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా ఉద్దేశ పూర్వకంగా పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని తీవ్రమైన పదజాలంతో దూషించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అమరావతి విషయం చూస్తుంటే చంద్రబాబు, పచ్చ మీడియా బందిపోట్ల ముఠాకన్న ఎక్కువ దుర్మార్గం చేస్తున్నారని, సంపదలు సృష్టి పేరుతో సంపద లూటీ చేస్తున్నారన్నారు. మాయ మాటలు మోసపు వాగ్దానాలు ప్రజలు నమ్మరు అనే విషయాన్ని గమనించాలని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకుడు గంగదాసు శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.
వైఎస్సార్ సీపీ మీడియా ప్యానలిస్ట్
చిట్టా విజయభాస్కరరెడ్డి


