పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు
సత్తెనపల్లి: ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతైన సంఘటన సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు సమీపంలోని అమరావతి మేజర్ కాలువ లాకుల వద్ద సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగన్నకుంట ఏరియాకి చెందిన మధిర గిరీష్ ఇస్తరాకుల షాపులో పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. మధిర గిరీష్ తో పాటు మరో ముగ్గురు స్నేహితులైన గొల్లపల్లి శాలెంరాజు, రాజువరపు మణికంఠ, పెద్దింటి నాగమురళి ఈత కొట్టేందుకు అమరావతి మేజర్ కెనాల్ కాలువకు సోమవారం సాయంత్రం వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువ గా ఉండటం వల్ల మధిర గిరీష్ గల్లంతయ్యాడు. ఎంతసేపటికి కనిపించకపోవడంతో మిగిలిన ముగ్గురు స్నేహితులు కాలువలో నుంచి బయటికి వచ్చి కేకలు వేశారు. అప్పటికే గిరీష్ కనిపించకపోవడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. దీంతో సత్తెనపల్లి రూరల్ ఎస్‌ఐ షేక్ అమినుద్దీన్, పోలీసులు, గిరీష్ కుటుంబ సభ్యులు,బంధువులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటి పడినప్పటికీ గిరీష్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. బిడ్డ గల్లంతైన విషయం తెలియడంతో గిరీష్ తల్లిదండ్రులు శ్రీదుర్గా, స్వామి, సోదరి హర్షిత, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. వారి రోదన చూపరులను సైతం కంటతడికి గురి చేసింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


