‘మన గ్యాస్‌–మన హక్కు’ కోసం పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

‘మన గ్యాస్‌–మన హక్కు’ కోసం పోరాడాలి

Apr 5 2026 8:30 AM | Updated on Apr 5 2026 8:30 AM

● కార్పొరేట్లకు వనరులు అప్పగించడం దుర్మార్గం ● విలేకర్ల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ● పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ అరవిందబాబు ఇటీవల ఎస్‌పీ కార్యాలయంలో హల్‌చల్‌ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అధికారులను శాసించడం ప్రజా ప్రతినిధులకు తగదన్నారు. అధికారుల పనితీరు లోపిస్తే సూచనలు ఇవ్వాలి గానీ దౌర్జన్యం చేయకూడదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండ పర్యటనలో వరికపూడిసెలపై ప్రకటన చేయకపోవడాన్ని విమర్శిస్తూ బొల్లాపల్లి, వెల్దుర్తి వంటి ప్రాంతాలలో నీటి సరఫరా చేయాలన్నారు. కేంద్ర మద్దతు ధరకు మొక్కజొన్న, వరి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య పాల్గొన్నారు.

నరసరావుపేట: రాష్ట్రంలోని సహజ వనరులను పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడం వల్లే గ్యాస్‌ సంక్షోభం ఏర్పడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ‘మన గ్యాస్‌–మన హక్కు’ కోసం కేంద్రంపై పోరాటం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం కోటప్పకొండ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా–గోదావరి (కేజీ బేసిన్‌) ప్రాంతంలో విస్తారంగా గ్యాస్‌, ఆయిల్‌ నిల్వలు ఉన్నప్పటికీ వాటిని ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఉన్న ఈ వనరులను వినియోగించకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి అధిక ధరలకు గ్యాస్‌ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావడం విచారకరమన్నారు. రాష్ట్రానికి చెందిన గ్యాస్‌ పైప్‌లైన్ల ద్వారా గుజరాత్‌, మహారాష్ట్రలకు తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పంపుతూ కార్పొరేట్‌ సంస్థలు రూ.వేల కోట్ల లాభాలు పొందుతున్నాయన్నారు. 12వ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి గ్యాస్‌, ఆయిల్‌పై సగం హక్కు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని సాధించేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. గ్యాస్‌ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడి రాష్ట్ర హక్కులను సాధించాలన్నారు. ఇక ఐటీ రంగంపై మాట్లాడిన ఆయన ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడులు ఉద్యోగాలపై వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. పెద్ద కంపెనీలు ఉద్యోగాల తొలగింపులు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు భద్రత కల్పించే విధానాలు తీసుకురావాలని కోరారు. ‘మన గ్యాస్‌–మన హక్కు’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు వి.శ్రీనివాసరావు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement