గణపవరం మున్సిపాలిటీనా... పంచాయతీనా!
నాదెండ్ల: పారిశ్రామిక కేంద్రంగా పేరొందిన గణపవరం మున్సిపాలిటీలో ఉన్నదా..గ్రామ పంచాయతీగా ఉన్నది తెలియక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో అభివృద్ధికి దూరమైంది. చిలకలూరిపేట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణపవరాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తూ 2019లో గజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. న్యాయపరమైన, సాంకేతిక కారణాలతో అటు మున్సిపాలిటీలో విలీనం కాక, ఇటు పంచాయతీలో కొనసాగకపోవటంతో అభివృద్ధి నిలిచిపోయింది. పన్నుల రూపంలో వచ్చే నామమాత్రపు ఆదాయంతోనే గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణ, పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు చెల్లింపులు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. విలీన ప్రక్రియను త్వరగా ఓ కొలిక్కి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆరేళ్లుగా నిలిచిపోయిన నిధులు
1958లో గణపవరం గ్రామ పంచాయతీ ఏర్పడింది. 2019లో చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైన అనంతరం కొన్ని నెలలు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా మున్సిపల్ నిధులతో జరిగాయి. న్యాయస్థానం విలీన ప్రక్రియపై స్టే విధించటంతో మున్సిపాలిటీ నుండి రికార్డులు తిరిగి పంచాయతీకి చేరాయి. అప్పటి నుండి పంచాయతీకి రావలసిన ఆర్థిక సంఘం నిధులు, గ్రాంట్లు విడుదల కాలేదు. మున్సిపాలిటీ పరిధిలో రావలసిన నిధులు సైతం నిలిచిపోయాయి. ఆరేళ్లుగా 15వ ఆర్థికసంఘం నిధులు ఏడాదికి రూ.80 లక్షల చొప్పున, పాపులేషన్ గ్రాంట్ రూ.1.68 లక్షలు, వృత్తి పన్నులు రూ.2 లక్షలు, స్టాంపు డ్యూటీ రూ.25–30 లక్షలు నిలిచిపోయాయి. ఉపాధి హామీ పథకం అమలు కాకపోవటంతో ఆ నిధులు సైతం ఆగిపోయాయి.
తగ్గిన ఆదాయం
గ్రామంలో సుమారు నలభై వరకూ చిన్న, పెద్ద తరహా పరిశ్రమలున్నాయి. పత్తి, పొగాకు, ఆయిల్ తదితర పరిశ్రమలు ఉండటంతో ఏటా పంచాయతీకి ఆస్తి పన్ను రూపంలో భారీగా ఆదాయం సమకూరేది. ఏడాదికి రూ.82 లక్షలు ఆస్తి పన్ను డిమాండ్ ఉండగా, ఇందులో ఇంటిపన్ను రూ.27 లక్షలు, పరిశ్రమల పన్ను రూ.55 లక్షలుగా ఉంది. కరోనా అనంతరం పలు పరిశ్రమలు మూతపడటంతో పన్నుల చెల్లింపులో ఒడిదుడుకులు నెలకొన్నాయి. రూ.55 లక్షల డిమాండ్‌కుగాను రూ.30లక్షలు మాత్రమే వసూలు అవుతున్నాయి. ఏడాదికి రూ.57 లక్షలు ఆస్తి పన్నులు, నీటి కుళాయిల ఫీజు రూ.10 లక్షలు మాత్రమే పంచాయతీకి జమ అవుతున్నాయి. సిబ్బంది జీతభత్యాలకే ఏడాదికి రూ.78 లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వీధిలైట్లు, బోరు రిపేర్లు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామసభల నిర్వహణ తదితర పనులకు పంచాయతీ నిధులు సరిపోవటం లేదు.
నెలలు గడుస్తున్నా తేలని విలీన ప్రక్రియ
ప్రభుత్వం నుంచి నిధులు బంద్
గ్రామంలో ఆగిన అభివృద్ధి


