బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రెండేళ్ల జైలు
నరసరావుపేట: బాల్య వివాహాలను ప్రోత్సహించినా, హాజరైనా నిందితులకు రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమాధికారి ఎం.ఉమాదేవి హెచ్చరించారు. గురువారం ప్రకాష్‌నగర్ షాదీఖానాలో సీడీపీఓ ఎం.కాంతకుమారి అధ్యక్షతన బాల్ వివాహ్ ముక్త భారత్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉమాదేవి మాట్లాడుతూ బాల్య వివాహం వలన కలిగే దుష్పరిణామాలను వివరించారు. బాల్య వివాహం గురించి సమాచారం తెలిస్తే గ్రామ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి, మండల స్థాయిలో సీడీపీవో, తహసీల్దార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, డివిజన్ స్థాయిలో ఆర్‌డీఓ, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. పల్నాడును బాల్యవివాహా రహిత జిల్లాగా చేయాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. అదనపు సీడీపీఓ మాణిక్యాలరావు, నరసరావుపేట, రొంపిచర్ల మండల అధికారులు, విద్యాశాకాధికారులు, మిషన్‌శక్తి కో ఆర్డినేటర్, ఐసీడీఎస్ అధికారులు, బాలల పరిరక్షణ వన్‌స్టాప్ సెంటర్ ప్రతినిధులు, సూపర్‌వైజర్లు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.


