రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
సత్తెనపల్లి: రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కె.ప్రసూన వైద్యులకు సూచించారు. సత్తెనపల్లిలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ వైద్యుడు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేయకపోవడంపై ఆర్‌ఎంఓను ప్రశ్నించారు. అనంతరం మాట్లాడుతూ ఓపీ బ్లాక్, సదరం క్యాంపు కలిసి ఉండటం వలన ఎక్కువ రద్దీగా ఉంటోందన్నారు. వెయిటింగ్ హాలులో సదరం క్యాంపు వారికి కుర్చీలు వేయాలని ఆదేశించారు. విధుల్లో సెక్యూరిటీ గార్డులు లేకపోవడాన్ని గుర్తించి మండిపడ్డారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు.
పెదకూరపాడు సీహెచ్‌సీలో..
పెదకూరపాడు: మండలంలోని పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా డాక్టర్ ప్రసూన తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సమస్యలు, అందుతన్న సేవలపై ఆరా తీశారు. వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రికార్డులు, మందుల నిల్వలు పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు. రాబోయే నెలలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని వసతులతో ప్రారంభిస్తామని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ విద్య, వైద్య సిబ్బంది ఉన్నారు.
ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా
కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన


