పోలీసు వనంలో విద్యా సుగంధం | - | Sakshi
Sakshi News home page

పోలీసు వనంలో విద్యా సుగంధం

Nov 25 2025 10:14 AM | Updated on Nov 25 2025 10:14 AM

పోలీస

పోలీసు వనంలో విద్యా సుగంధం

కోల్‌ మాఫియాకు చెక్‌

చిలకలూరిపేట: ఓ ఐపీఎస్‌ అధికారిగా కల్లోల కాశ్మీరంలో యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్స్‌... నక్సల్స్‌ ప్రభావిత చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో నక్సల్‌ నియంత్ర విధులు... వెస్ట్‌ బెంగాల్‌లో కోల్‌ మాఫియా, దేశ సరిహద్దుల్లో స్మగ్లర్లతో తలపడటం వంటి సాహసభరిత, అత్యంత ప్రమాదభరిత విధుల నిర్వహణ ఒక వైపు.. మరోవైపు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థల నుంచి ఎంబీఏ, పీహెచ్‌డీ, డాక్టర్‌ ఆఫ్‌ లా వంటి విద్యార్హతలు సాధించడం ఆయనకే సాధ్యమైంది. వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రంలో డీజీపీ హోదాలో రిటైర్డ్‌ అయిన ఐపీఎస్‌ అధికారి బొప్పూడి నాగరమేశ్‌ స్వగ్రామం చిలకలూరిపేటలోని బొప్పూడి. ఊరి పేరే ఇంటిపేరుగా కలిగిన ఆయన్ను ఆయనను లక్ష్యసాధనకు మరోపేరుగా చెప్పుకోవచ్చు. కృషి ఉంటే మనుషులు రుషులౌతారనే విధంగా కొనసాగుతున్న ఆయన జీవన పయనం ఎందరికో స్ఫూర్తిదాయకం.

పరాక్రమవంతుడైన అధికారి

బొప్పూడి పాండురంగారావు, నాగమణి దంపతులకు 20 జులై 1963లో బొప్పూడి నాగ రమేశ్‌ జన్మించారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా వ్యవహరించిన తండ్రితోపాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంటర్‌ వరకు విద్యాభ్యాసం కొనసాగింది. 1983లో ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుంచి బీటెక్‌ పట్టా పొందారు. అక్కడి నుంచి ఐదేళ్లపాటు జెంషెడ్‌పూర్‌లోని టాటా మోటార్స్‌లో ఇంజినీర్‌గా విధులు నిర్వహించారు. 1988లో ఐఐఎంలో ఎంబీఏ సీటు, సివిల్‌ సర్వీసెస్‌లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. దీంతో ఐపీఎస్‌లో చేరి హైదరాబాద్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ అనంతరం వెస్ట్‌ బెంగాల్‌ కేడర్‌కు నియమితులయ్యారు. తొలి పోస్టింగ్‌ ఎస్‌డీపీవోగా వనగ్రామ్‌లో నియమితులయ్యారు. అక్కడ యాంటీ స్మగ్లింగ్‌ ఆపరేషన్స్‌లో పాల్గొని రూ.కోట్లు విలువైన స్మగ్లింగ్‌ సామగ్రి పట్టుకోడవం ద్వారా సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు. అనంతరం 1991లో బారక్‌పూర్‌ ఏడీఎస్పీగా పదోన్నతి లభించింది. అక్కడ గ్యాంబ్లింగ్‌, హెరాయిన్‌ స్మగ్లింగ్‌ ముఠాల నియంత్రణకు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పై పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి.

విద్యా ప్రస్థానం

ఒకవైపు సీఆర్‌పీఎఫ్‌, యాంటీ టెర్రరిస్ట్‌ ఆపరేషన్స్‌ వంటి ప్రమాదభరిత విధులు నిర్వహిస్తూనే తనకు అత్యంత ఇష్టమైన విద్యా వ్యాసంగాన్ని నాగరమేశ్‌ కొనసాగించారు.

● మొదటగా ఐఐఎంలో ఎంబీఏ సీటు వచ్చినా, ఐపీఎస్‌ కారణంగా వదులుకున్న నేపథ్యంలో అక్కడి నుంచే విద్యాప్రస్థానం కొనసాగించారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని ఐఐఎం కోల్‌కత్తా నుంచి ఎంబీఏ డిగ్రీని 2003లో పూర్తి చేశారు.

● 2004–10 మధ్య ఖరగ్‌పూర్‌ ఐఐటీ నుంచి మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పట్టాలు పొందారు.

● 2014–18 మధ్య నేషనల్‌ లా యూనివర్సిటీ ఢిల్లీ నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు.

● కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎంఏ సైకాలజీతోపాటు స్పానిష్‌, చైనీస్‌ భాషల్లో ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి కోర్సులు పూర్తి చేశారు.

● 2024లో నేషనల్‌ లా యూనివర్సిటీ నుంచి ప్రతిష్టాత్మక డాక్టర్‌ ఆఫ్‌ లా పట్టా పొందారు.

● 2015 ప్రాంతంలో అమెరికాలోని నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ యూనివర్సిటీలో విద్యార్థులకు భారత ప్రభుత్వం తరుఫున వెళ్లి పాఠాలు బోధించారు.

● ప్రస్తుతం తెలంగాణా హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ సభ్యుడుగా ఉన్న ఆయన పేద ప్రజలకు న్యాయసేవలు అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సాక్షికి వివరించారు. దీనికి తోడు విదేశీ యూనివర్సిటీల నుంచి అంతర్జాతీయ అంశాలపై పరిశోధన చేయనున్నట్లు తెలిపారు. చివరగా దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు నిజాయతీగా, ఎవరికీ లొంగిపోకుండా విధులు నిర్వహిస్తే దేశంలో అవినీతి, అరాచకం అంతరించి పోయి దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పోలీస్‌ విధులు నిర్వహిస్తూనే నాగ రమేశ్‌ అపారమైన జ్ఞాన సముపార్జన

ఉద్యోగ ప్రస్థానంలో పలు పతకాలు

ప్రతిష్టాత్మక ఐఐటీ,ఐఐఎం వంటి

సంస్థల నుంచి డిగ్రీలు

అనంతరం 2001–03 మధ్య కాలంలో వర్ధమాన్‌జిల్లా ఎస్పీగా నియమితులై కోల్‌ మాఫియాను సమర్థంగా ఎదుర్కొవడం ద్వారా ప్రభుత్వరంగ ఈసీఐఎల్‌ కు రూ.రెండువేల కోట్లు లాభం చేకూరేందుకు దోహదపడ్డారు. 2005లో డీఐజీగా పదోన్నతి పొందిన ఆయన 2008లో సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా(యాంటీ ఇన్‌సర్‌జెన్సీ) హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేశారు. 2010లో చత్తీస్‌గఢ్‌లోని దర్బాఘాటీ ప్రాంతంలో మావోయిస్టులు 73 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను హతమార్చటంతో ఆ ప్రాంతంలో ఐజీ ఆపరేషన్స్‌గా నియమితులయ్యారు. అక్కడ ఆయన విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలకు పరాక్రమ మెడల్‌ లభించింది. అదే ఏడాది చివరిలో కశ్మీర్‌లో యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్స్‌ ఐజీగా నియమితులయ్యారు. అక్కడ 2011–12 ప్రాంతంలో హార్డ్‌కోర్‌ పాకిస్తానీ టెర్రరిస్టు అబ్దుల్లా ఉని ఎన్‌కౌంటర్‌ ఆయన సారథ్యంలో జరిగింది. ప్రభుత్వం నుంచి రూ.3లక్షలు రివార్డు సైతం అందుకున్నారు. అనంతరం 2013–15 కాలంలో ఢిల్లీలోని ఇంటర్నల్‌ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్‌గా, సీఆర్‌పీఎఫ్‌ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. 2016లో తిరిగి వెస్ట్‌బెంగాల్‌కు అడిషనల్‌ డీజీగా వెళ్లిన ఆయన 2020లో డీజీగా పదన్నోతి పొంది 2023లో డీజీపీగా పదవీ విరమణ చేశారు.

పోలీసు వనంలో విద్యా సుగంధం 1
1/1

పోలీసు వనంలో విద్యా సుగంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement