కమిషన్‌తో సమగ్ర కుల గణన చేపట్టాలి
నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల జనాభా దామాషా మేరకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేసి, పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు చట్టసభలలో 33 శాతం, స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలన్నా, ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్రంగా బీసీ కులాల జనగణన జరిపించాలని ఆయన కోరారు. 139 బీసీ కులాల్లో ఎవరెంతో తెలియకుండా రిజర్వేషన్లు అమలు జరుపుతారని ఆయన ప్రశ్నించారు. బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు అమలు జరిపి సామాజిక న్యాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగారపు గురు ఆంజనేయులు, యువజన అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సరికొండ తిమ్మరాజు, తన్నీరు వెంకట్, ముదిరాజ్, జిల్లా నాయకులు బి.శ్రీనివాసరావు, శీలం వెంకట్రావు పాల్గొన్నారు.


