సాయం అందలేదు
● అన్నదాత సుఖీభవ పథకంలో అన్యాయం
● రెండో విడతలోనూ బాబు
సర్కారు మొండిచేయి
● జిల్లాలో 1.60 లక్షల
మంది కౌలు రైతులు
● వర్తించని ప్రభుత్వ పథకాలు, రాయితీలు
● పండించిన పంట చేతికి అందక అవస్థలు
సత్తెనపల్లి: అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తరువాత మొదటి సంవత్సరం పథకం వర్తింప చేయలేదు. ప్రస్తుతం రెండో సంవత్సరంలోనూ మొండి చేయి చూపిందనే విమర్శలు ఉన్నాయి. కౌలు రైతుల సంగతి పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయోజనం సమకూరడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు.
జిల్లాలో సుమారు 1.60 లక్షల మంది
కౌలు రైతులు...
జిల్లాలో సుమారు 1.60 లక్షల మంది కౌలు రైతులు పొలాలు సాగు చేస్తుండగా, కేవలం 67 వేల మందికి మాత్రమే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు(సీసీఆర్) పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 57 వేల మందికి మాత్రమే సీసీఆర్ కార్డుల పంపిణీ జరిగింది. సీసీఆర్ కార్డులు పొందిన కౌలు రైతులకు సైతం ఇప్పటికీ ఎటువంటి ప్రయోజనం సమకూరలేదు. సీసీఆర్ కార్డు లేని వారు సుమారు 1.03 లక్షల మంది వరకు ఉంటారని కౌలు రైతులు చెబుతున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
కౌలు రైతులకు లబ్ధి..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కౌలు రైతులకు అన్ని విధాల అండగా నిలిచేది. భూ యజమానులతో పాటు కౌలు రైతులకు రైతు భరోసా పేరిట సాయం అందించింది. పంట నష్టం జరిగినప్పుడు కౌలు రైతుల ఖాతాలకు పరిహారం జమ చేసేది. కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో కౌలురైతులు పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకునేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం మొదటి ఏడాది సాయం ఎగ్గొట్టేసింది. రెండో ఏడాది అన్నదాత సుఖీభవ సాయాన్ని కౌలు రైతులకు అందజేయలేదు. దీంతో జిల్లాలోని 1.60 లక్షల మంది కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు.
నేను రెండు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల సమయంలో చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత అందకపోగా ప్రస్తుతం రెండో విడతలోనూ అందలేదు. కౌలు రైతులకు సాయం అందించి ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– జంగం కోటయ్య,
కౌలు రైతు, రాజుపాలెం
కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలి. మోంథా తుఫాన్ నష్టపరిహారం కూడా కౌలు రైతులందరికీ వర్తింప చేయాలి. మిగిలిపోయిన కౌలు రైతులందరికీ సీసీఆర్ కార్డులు అందించి పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.
–పెండ్యాల మహేష్, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి, పల్నాడు
సాయం అందలేదు
సాయం అందలేదు


