చలికాలం .. జర భద్రం
చలి నుంచి శరీరాన్ని రక్షించుకోవాలి
●గత వారం రోజులుగా పెరిగిన చలి తీవ్రత
● జిల్లాలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
● ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం
●జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
సత్తెనపల్లి: చలి పంజా విసురుతున్న పరిస్థితి జిల్లా అంతటా కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఉదయం, రాత్రి చల్లటి గాలులు వీస్తున్నాయి. వాతావరణం చల్లబడి శీతాకాలం పూర్తి స్థాయిలో ఆవరించింది. జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా మంచు తెరలు వీడకపోవడం, సాయంత్రం ఐద గంటలకే చీకటి పడటం కనిపిస్తోంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతల మార్పుతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. తెల్లవారుజామునే పొలాలకు వెళ్లే రైతులు, పాలు, కూరగాయలు, ఆకు కూరలు విక్రయించేవారు, పేపర్లు వేసేవారు, టీ, అల్పాహార దుకాణదారులు రక్షణ కవచాలు ధరించి కూడా వణుకుతూనే జీవన పోరాటానికి వెళుతున్నారు.
పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు...
చలి కారణంగా జలుబు, దగ్గు, ఆస్తమా, బ్రాంకై టిస్ వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. వృద్ధులలో కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ అర్థరైటిస్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. అలాగే చర్మం పగలడం, పొడిబారడం వంటి సమస్య లు కనిపిస్తున్నాయి. అతి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల శరీర ఉష్ణోగ్రత పడిపోయి, ప్రాణాంతకమైన హైపోథెర్మియాకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తు న్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు...
చలితీవ్రత పెరిగిన దృష్ట్యా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.
● ఉదయం, సాయంత్రం వేళల్లో ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, చేతి తొడుగులు ధరించడం తప్పనిసరి.
● బయటకు వెళ్లేటప్పుడు శరీరమంతా కప్పి ఉంచేలా చూసుకోవాలి.
● శరీరానికి వేడినిచ్చే పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా వేడి పాలు, సూప్‌లు, హెర్బల్ టీలు తాగటం మంచిది.
● చలిమంటలు కాచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్నారులను అగ్రి ప్రమాదాల నుంచి దూరంగా ఉంచాలి.
● రాత్రి పడుకునేటప్పుడు గదిని వెచ్చగా ఉంచుకోవాలి. వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా చలికి గురికాకుండా చూడాలి.
● శరీరంలో తేమ నిలిచి ఉండేందుకు మాయిశ్చరైజర్ వాడాలి.
● గోరువెచ్చని నీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు.
● చలి కారణంగా శరీరం గట్టిపడకుండా ఉండటానికి తేలికై న వ్యాయామాలు, నడక వంటివి చేయడం మంచిది.
● చలి సమయంలో దాహం తక్కువగా ఉన్నా కూడా రోజంతా నీటివి తాగడం అవసరం. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.
● వెంటనే చల్లని వాతావరణంలో నుంచి వేడిగదిలోకి రావడం లేదా వేడి నుంచి ఒక్కసారిగా చల్లని వాతావరణంలోకి వెళ్లడం నివారించాలి.
● దమ్ము, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు ఉన్నవారు చలి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
అవసరమైన మందులు దగ్గర ఉంచుకుని, బయటకు వెళ్లడం తగ్గించాలి.
శీతాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలను పాటించాలి. చలి నుంచి శరీరాన్ని రక్షించు కోవాలి. గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. శ్వాస కోశ సమస్యతో ఇబ్బందులు వస్తే వెంటనే వైద్యశాలలను సందర్శించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలిలో తిరగ కుండా చూసుకోవాలి. ప్రజలు బయటికి వచ్చే సమయంలో టోపీ, కండువా, చేతి తొడుగులు ధరించాలి. చర్మాన్ని కవర్ చేస్తూ .. జల నిరోధిత బూట్లు ధరించాలి. చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు అవసరమైతేనే బయటుకు రావాలి. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించవద్దు. చలి కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు.
– డాక్టర్ బి.రవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, పల్నాడు
చలికాలం .. జర భద్రం
చలికాలం .. జర భద్రం


