టీస్టాల్ నిర్వాహకుడిపై కత్తితో దాడి
నరసరావుపేట టౌన్: టీస్టాల్ నిర్వాహకుడిపై వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. చాకిరాల మిట్టకు చెందిన ముట్టుకూరు మణికంఠ సత్తెనపల్లి రోడ్డులో సారిక టీ స్టాల్ నిర్వహిస్తుంటాడు. సాయంత్రం దుకాణంలో టీ కాస్తుండగా వెనుక నుంచి వచ్చిన సుబ్బారావు కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడికి పాల్పడ్డాడు. సంఘటనలో మణికంఠ తల వెనుక భాగంలో రక్త గాయమైంది. క్షతగాత్రుడిని సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. దాడికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీహెచ్ ప్రభాకర్ తెలిపారు.
అనంతవరం(క్రోసూరు): మండలంలోని అనంతవరం గ్రామంలో సిమెంట్ పనులకు వెళ్లే కూలీ విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే... గ్రామానికి చెందిన ఉసిరికాయల నరసింహారావు ఉరఫ్ ముసలయ్య (54) గ్రామంలో ఇంటి నిర్మాణ పనుల్లో కూలి పనికి వెళ్లాడు. పని నిమిత్తం ఇంటిపైకి వెళ్లగా ఇంటిపైన 11కేవీ విద్యుత్ తీగలు ఉండటంతో విద్యాదాఘాతానికి గురై అక్కడి నుంచి కిందపడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
టీస్టాల్ నిర్వాహకుడిపై కత్తితో దాడి


