కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలు రణక్షేత్రం కారెంపూడిలో బుధవారం రాత్రి కార్తిక అమావాస్య నుంచి ప్రారంభం అయ్యాయి. వివిధ కారణాలతో ఇక్కడ నుంచి వలస వెళ్లిన వీరాచార వంతులు తమ వద్ద ఉన్న వీరుల ఆయుధాలతో తరలి వస్తున్నారు. ముందుగా కళ్లిపోతురాజును దర్శించుకుని, వీరుల గుడి పక్కనే ఉన్న నాగులేరు గంగధారిలో స్నానాలు చేస్తున్నారు. ఆయుధాలు శుభ్రం చేసుకున్నాక అలంకరించుకుని వీరుల గుడిలో పెడుతున్నారు. గురువారం కూడా వీరాచారులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరుల గుడిలోని ఆయుధాలను వెలుపలికి తీసి గుడికి శుభ్రంగా వెల్లవేశారు. తర్వాత వాటిని అలంకరించి తిరిగి గుడిలో పెట్టారు. రాత్రి వరకు వచ్చిన వీరాచారులు తమ ఆయుధాలతో గ్రామోత్సవంగా బయలు దేరి చెన్నకేశవస్వామి, వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. బ్రహ్మనాయుడు విగ్రహానికి నమస్కరించి ధూపం వేశారు. తర్వాత కోట బురుజు మీదుగా పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటికెళ్లి ఆయనను తోడ్కొని వీరుల గుడికి చేరుకున్నారు. వీరాచారులందరికీ పేరుపేరున పీఠాధిపతి కంకణధారణ చేశారు. వీరుల గుడి ముఖ మండపంపై ఎర్రజెండా ప్రతిష్టించి, ఉత్సవాలను ప్రారంభించారు. ఆ తర్వాత వీరుల గుడి ఆవరణలోని తూర్పు మండపం వద్ద నైవేద్యం తయారు చేయించి వీరుల ఆత్మలకు అర్పించే క్రతువు నిర్వహించారు. రాచగావు కార్యక్రమాన్ని సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. వీరవిద్యావంతులు రాచగావు కథాగానం తెల్లవార్లూ చేశారు. ఉత్సవ ప్రాంగణానికి కాపలా ఉండాలని బ్రహ్మనాయుడు పోతురాజుకు ఆన పెట్టిన ఘట్టంతోనే ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
పల్నాటి రణక్షేత్రానికి ‘వీరారాధన’ శోభ
పల్నాటి రణక్షేత్రానికి ‘వీరారాధన’ శోభ
పల్నాటి రణక్షేత్రానికి ‘వీరారాధన’ శోభ


