వీఆర్‌ఏల పోరుబాట
పెదకూరపాడు: ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సహాయకులు పోరుబాట పట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షుడు షేక్ బందగి సాహెబ్ తెలిపారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గురువారం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద వీఆర్‌ఏలు నిరసన చేపడతారని తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా వీఆర్‌ఏలకు సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. ఎన్నోసార్లు మంత్రులు, అధికారులకు వినతి పత్రాలు అందజేసినా స్పందన కరువైందన్నారు. దశల వారీ పోరాటానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. వీఆర్‌ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్లు, అటెండర్ నైట్ వాచ్మెన్ పోస్టులను వీఆర్‌ఏల చేత 70 శాతం భర్తీ చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా గుర్తించాలని, వివిధ ఖాళీ పోస్టుల భర్తీలో వీఆర్‌ఏకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాటాన్ని జయప్రదం చేయాలని వీఆర్‌ఏలకు పిలుపునిచ్చారు.


