సమైక్య భారతావనికి పునాది వేసిన సర్దార్ పటేల్
నరసరావుపేట: దేశ సమైక్యత కోసం ధృడంగా నిలబడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ‘మై భారత్ గుంటూరు’ ఆధ్వర్యంలో బుధవారం నరసరావుపేటలో సర్దార్ 150 ఐక్యత జిల్లాస్థాయి పాదయాత్ర ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ క్రీడా మైదానంలో ప్రారంభమై పల్నాడు రోడ్డు వెంబడి సాగింది. ఎంపీ లావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ షేక్ యూసఫ్ అలీ, ఆర్డీఓ కె.మధులత, మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు దేవిరెడ్డి కిరణ్మయిలు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఎంపీ లావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలోని సంస్థానాల విలీనానికి చేసిన కృషి అమోఘమన్నారు. కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ వ్యక్తిగత ప్రాంతీయ ప్రయోజనాల కంటే దేశ సమైక్యతా గొప్పదని చాటి చెప్పిన సర్దార్ పటేల్ ఆధునిక భారతదేశానికీ పునాదులు వేయడానికి అవిశ్రాంతంగా కృషిచేశారన్నారు. దేవిరెడ్డి కిరణ్మయి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆత్మ నిర్భర్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. పట్టణ కమిషనర్ మేడికొండ జస్వంతరావు, తహసీల్దార్ కె.వేణుగోపాల్, బీజేపీ నాయకులు జన్నాభట్ల ఆదిత్య, పులిగుజ్జు మహేష్, కళాశాల కార్యవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపిలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయ గుప్తా, రోటరీ క్లబ్ ప్రతినిధి సుమిత్ర కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ అన్నదాసు సరళ కుమారి, ఎన్‌సీసీ ఆఫీసర్ బీఎస్‌ఆర్‌కే రాజు పాల్గొన్నారు.
ఐక్యతా ర్యాలీని ప్రారంభించిన
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు


