యూరియా కోసం
రైతులు ఆందోళన చెందొద్దు
నిల్వలపై రోజువారీ
బులెటిన్ విడుదల చేస్తాం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు
నరసరావుపేట: జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మరోసారి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో యూరియా అంశంపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబరు నాటికి 34,556 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటి వరకూ 36,615 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం నుంచి అందిందన్నారు. రైతులకు 26,616 మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా, 7,442 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనవసర భయాలతో రైతులు అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు నెలాఖరుకు రాష్ట్రానికి రానున్న మరో రెండు లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల యూరియాలో జిల్లా రైతులకు అవసరమైన కేటాయింపులు ఉంటాయన్నారు. యూరియా అక్రమాలు అరికట్టేందుకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, మార్కెటింగ్ శాఖల సిబ్బంది సంయుక్తంగా తనిఖీ సిబ్బందిని నియమించామన్నారు. అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రోజూ యూరియా నిల్వలపై బులెటిన్ విడుదల చేసి అనవసర అనుమానాలకు తావులేకుండా చూస్తామన్నారు.
●వర్షాలు అంచనాలకు మించి కురవడం, సాగర్‌లో పుష్కలంగా నీరు ఉండటంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగు నమోదైందన్నారు. గత ఏడాది సెప్టెంబరు నాటికి 82 వేలు హెక్టార్లలో విత్తనం వేయగా, ఈ ఏడాది 97వేలు హెక్టార్లకు చేరిందన్నారు. సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు. యూరియా సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ సరిహద్దులో యూరియా అక్రమ రవాణా అడ్డుకునేందుకు పొందుగల, తంగేడ, నాగార్జునసాగర్ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవిగాక ఇతర మైనర్ రూట్లలో సైతం సిబ్బందిని నియమించామన్నారు. అక్రమార్కుల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
●ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ యూరియా నిత్యవసర సరుకుల పరిధిలో ఉన్నందున ఎసెన్షియల్ కమాడిటీస్ చట్టం, పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు. యూరియా కొరతపై అసత్య వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. జేసీ సూరజ్ ధనుంజయ్ గనోరే, జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు పాల్గొన్నారు.
అక్రమార్కులపై ఈసీ,
పీడీ యాక్టు కింద కేసులు
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి నగదు రహిత చికిత్స
నరసరావుపేట: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు వెల్లడించారు. జాతీయ ఆరోగ్య అథారిటీ వద్ద నమోదైన ఆసుపత్రుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు జాతీయ ఆరోగ్య అథారిటీలో నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత మెంబర్ సెక్రటరీ, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గీతారాణి జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ ప్రజెంటేషన్ చేశారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నిరోధానికి పోలీసు, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖలు సంయుక్తంగా కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల జాతీయ, రాష్ట్ర హైవేలపై రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుదల పట్టిందన్నారు. అయితే ఇతర రోడ్లలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందన్నారు. రోడ్డుసేఫ్టీ ఎన్‌జీఓ సంస్థ కన్వీనర్ దుర్గా పద్మజ శిక్షణ పూర్తిచేసుకున్న వారికే డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి, ఆర్డీఓ కె.మధులత, ఆర్టీసీ ఆర్‌ఎం అజిత కుమారి, డీఈఓ చంద్రకళ, జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్‌కుమార్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మణికంఠ, నరసరావుపేట కమిషనర్ ఎం.జస్వంతరావు, ఎన్‌హెచ్‌ఐ అధికారులు పాల్గొన్నారు.