
శాంతించిన కృష్ణమ్మ
ఊపిరి పీల్చుకుంటున్న రైతులు
కొల్లూరు: కృష్ణా నదీ తీర గ్రామాల ప్రజలు, రైతులను భయాందోళనలకు గురి చేసిన కృష్ణమ్మ ఎట్టకేలకు శాంతించింది. నెల రోజుల నుంచి నదిలో నిండుగా నీరు ప్రవహించింది. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో బుధవారం నీటి మట్టం కూడా అడుగంటడం మొదలెట్టింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటి విడుదలను ఆ శాఖాధికారులు తగ్గించడంతో రైతులను వరద భయం వీడింది. ఎగువనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కూడా నీటి విడుదల నిలిచిపోయింది. మున్నేరు తదితర వాగుల నుంచి వస్తున్న స్వల్ప మొత్తంలో నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదలవుతోంది. బుధవారం ఉదయం 1.73 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవగా, క్రమంగా అధికారులు తగ్గించారు. సాయంత్రానికి 36 వేల క్యూసెక్కులకు పరిమితమైంది.
యథావిధిగా రాకపోకలు
వరద తీవ్రత తగ్గిన కారణంగా మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున పోతార్లంక మార్గంలో లోలెవల్ వంతెన పైనుంచి రాకపోకలు యథథావిధిగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లు వరద భయంతో ఆందోళనకు గురైన పరీవాహక ప్రాంత రైతులు కృష్ణమ్మ శాంతించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.