
హైవే బాధితులకు న్యాయం చేయండి
నరసరావుపేట: వినుకొండ–గుంటూరు నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న ఉప్పలపాడు గ్రామస్తులు, పట్టణ ప్రాంతవాసులకు తగిన న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ హైవే పనులపై అభ్యంతరాలను స్వీకరించేందుకు శుక్రవారం కలెక్టరేట్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్ట్ డైరక్టర్ పార్వతీశం నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు గ్రామస్తులు, పట్టణ ప్రాంతవాసులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి బాధితులకు మద్దతుగా డాక్టర్ గోపిరెడ్డి హాజరయ్యారు.
పరిహారం ఇచ్చాకే పనులు
పీడీ పార్వతీశం మాట్లాడుతూ.. మొత్తం 80 కిలోమీటర్ల పొడవైన హైవేలో 45 కిలోమీటర్ల మేర భూ సేకరణ పూర్తయిందన్నారు. ఐదు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్‌ఓబీ) నిర్మాణాలు అవసరం అవుతాయని చెప్పారు. వచ్చే డిసెంబర్ లేదా మార్చిలోపు టెండర్ పిలవనున్నట్లు పేర్కొన్నారు. భూ సేకరణపై ఎన్‌ఎస్‌పీ, చిన్న నీటి పారుదల శాఖల అధికారుల అభ్యంతరాలను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం విడుదల చేసిన నూతన మార్గదర్శకాల మేరకు భూములు సేకరిస్తామని తెలిపారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు మొదలు పెడతారన్నారు. రైటాఫ్ వే పద్ధతిని అనుసరించి 40 మీటర్లకు పైగా భూమి సేకరించనున్నట్లు వివరించారు. ఈ రోడ్డు మార్గంలో రోడ్డు వంకర తిరిగిన శావల్యాపురం, పెట్లూరివారిపాలెం గ్రామాల వద్ద బైపాస్ నిర్మాణం చేస్తారని చెప్పారు. ఉప్పలపాడు వద్ద రోడ్డు సక్రమంగా ఉండటం వలన బైపాస్ నిర్మాణం ప్రతిపాదించలేదని అన్నారు.
ఉప్పలపాడు వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించండి ఎన్‌హెచ్‌ఏఐ పీడీకి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సూచన
నష్టం తగ్గేలా భూసేకరణ చేపట్టాలి
దీనిపై డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 80 కిలోమీటర్ల రోడ్డు పొడవులో ఉప్పలపాడు గ్రామ విస్తీర్ణం అధికంగా ఉందన్నారు. రోడ్డును ఆనుకొని ప్రజలు నివాసం ఉండటం వలన భూ సేకరణతో ఎక్కువ మంది విలువైన భూములు, ఇళ్లు కోల్పోతున్నారన్నారు. అవకాశం ఉంటే ఉప్పలపాడు వద్ద బైపాస్ నిర్మాణం చేపట్టి నష్టాన్ని తగ్గించాలని కోరారు. ఉప్పలపాడు నుంచి ఎస్‌ఆర్‌కేటీ సెంటర్ వరకు ఐదు కిలోమీటర్ల దూరంలో రోడ్డుకు ఒకవైపే భూసేకరణ కారణంగా అనేకమంది గృహాలు, మిల్లులు, వాణిజ్య సముదాయాలు కోల్పోతున్నారన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొంది ఆ డబ్బులతో ఇళ్ల నిర్మాణం చేసిన వారు కూడా ఇక్కడ ఉన్నారన్నారు. జగనన్న కాలనీలో సుమారు ఆరు వేల మందికి ప్లాట్లు ఇచ్చారని, 500 మంది ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారని గుర్తుచేశారు. ఈ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా భూమి సేకరిస్తే నష్టం తగ్గుతుందన్నారు. డాక్టర్ గోపిరెడ్డితో పాటు పార్వతీశం, గ్రామస్తులు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు షేక్ కరిముల్లా, డాక్యుమెంట్ రైటర్ మోహనరెడ్డి, రామాంజనేయరెడ్డి, పెద్దిరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.