
కొలిక్కిరాని బది‘లీలలు’
● జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద వెల్ఫేర్ సెక్రటరీల పడిగాపులు ● సుదూరంగా ఉన్న సచివాలయాలకు బదిలీ చేయడంపై ఆవేదన ● రివైజ్ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్న సెక్రటరీలు
నెహ్రూనగర్: ఉమ్మడి జిల్లా రూరల్ పరిధిలో పనిచేసే గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సెక్రటరీల బదిలీల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. సొంత మండలంలో పని చేయకూడదనే ప్రభుత్వ ఉత్తర్వులను ఆధారం చేసుకుని అధికారులు ఇష్టానుసారంగా బదిలీలు చేశారు. ఈ నెల 7న వెలువడిన ఉత్తర్వులు చూసి సెక్రటరీలు కంగుతిన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలకు బదిలీ చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి గుంటూరులో 874 మంది వెల్ఫేర్ సెక్రటరీలు ఉన్నారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించకుండానే వెబ్ ఆప్షన్స్(గూగుల్ ఫాం) ఇచ్చి బదిలీల ప్రక్రియను అస్తవ్యస్తంగా నిర్వహించారు. చాలా మందిని ప్రస్తుత సచివాలయం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయానికి బదిలీ చేశారు. దీంతో ప్రతిరోజూ వందల మంది సచివాలయ సెక్రటరీలు గుంటూరు నగరంలోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయానికి వస్తున్నారు. తమను అంత దూరానికి బదిలీ చేస్తే ఏ విధంగా వెళతామంటూ అధికారులను వేడుకొంటున్నారు. దయతలిచి సొంత మండలం పక్కనే ఉన్న మండలంలోకి మార్చాలంటూ విన్నవించుకుంటున్నారు.
ముడుపులకే ప్రాధాన్యం
నిబంధనల ప్రకారం స్పౌజ్ కేటగిరికి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, అధికారులు దాన్ని పక్కన పెట్టారు. ముడుపులు తీసుకుని కొందరికి నచ్చిన స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పనిచేసే సెక్రటరీలకు బదిలీల ప్రక్రియ భారంగా మారింది. ప్రతి రోజు అక్కడ నుంచి గుంటూరు జిల్లా ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయానికి పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, న్యాయబద్ధంగా బదిలీల ప్రక్రియ జరపాలని కోరుతున్నారు.