
తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణానికి కార్యాచరణ
అచ్చంపేట: మండలంలోని పుట్లగూడెం నుంచి బెల్లంకొండ మండలం వెంకటాయపాలం వరకు అడవిలోనుంచి నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు, ఇటీవల కూల్చివేతకు గురైన తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణాలకు అటవీ శాఖాధికారులు గురువారం కార్యాచరణ ప్రారంభించారు. వీటి సాధనకోసం తాము ఢిల్లీ వరకు వెళ్లి ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అఖిలభారత గిరిజన వికాస పరిషత్ అధ్యక్షుడు భూక్యా తులసినాయక్ (బీటీ నాయక్), కార్యదర్శి భూక్యా రమేష్ నాయకులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్రిటీష్ కాలంలో ఉన్న నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు నిర్మాణానికి, అడవి మధ్యలో ఉన్న తమ ఆరాధ్య దేవత తుల్జా భవానీ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కావలసిన భూమి కేటాయింపునకు అధికారులు సర్వే నిర్వహి ంచారన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే అచ్చంపేట, బెల్లంకొండ మండలాల మధ్య దూరం తగ్గి రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు పాత రికార్డులు, శాటిలైట్ పిక్చర్స్ పరిశీలించి బాట ఉన్న విషయాన్ని రూఢి చేసుకున్నారన్నారు. అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి అనువైన స్థలం కోసం అన్వేషించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెస్సర్స్ మరోని ఇన్‌ఫ్రా సంస్థ మేనేజర్ జి.బాలాజీ, సివిల్ ఇంజినీర్ డి.నాగరాజు, నరసరావుపేట ఫారెస్ట్ రేంజర్ అధికారి అడవిలో అనువైన స్థలాలను పరిశీలించారన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు, వెంకటాయపాలెం సర్పంచ్ భూక్యా నాగమ్మ, మాజీ సర్పంచ్ మేళం శ్రీరామమూర్తి, హన్మంత్ నాయక్, ఆర్యవైశ్య నాయకులు దేవరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.