బంగారు భవిత బాటన | Sakshi
Sakshi News home page

బంగారు భవిత బాటన

Published Thu, May 23 2024 5:20 AM

బంగార

సత్తెనపల్లి: జిల్లాలో దివ్యాంగులను బడిబాట పట్టించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. చదువులకు దూరంగా ఉన్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించేందుకు అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాలల్లో చేరని వారితోపాటు మధ్యలో విద్యకు దూరమైన వారి వివరాలను సేకరిస్తున్నారు. చదువు వల్ల ప్రయోజనాలు, దివ్యాంగుల సంక్షేమానికి అమలవుతున్న రాయితీలు, సదుపాయాల గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఈ సర్వేతో ఇప్పటికే కొందరు బడుల్లో చేరేందుకు ముందుకు వచ్చారని చెబుతున్నారు.

విస్తృతంగా గడప గడపకు సర్వే

సాధారణ విద్యార్థులతో సమానంగా దివ్యాంగులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు రూ.కోట్లతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. వీటిపై అవగాహన లేక ఇప్పటికీ అనేక మంది తల్లిదండ్రులు ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. దీని వల్ల ఆ పిల్లల్లో వైకల్యానికి తోడు విద్యాబుద్ధులు లోపించి ఇళ్లలోనే మగ్గిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి వారందరినీ భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు గడప గడపకు సర్వేను సహిత విద్య అధికారులు చేపట్టారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం వేసవి సెలవుల సమయాన్ని దీని నిమిత్తం వినియోగిస్తున్నారు. పాఠశాలలు తెరిచే నాటికి గుర్తించి అందరినీ భవిత కేంద్రాల్లో చేర్చడానికి వీలుగా కార్యాచరణను సిద్ధం చేశారు.

పాఠశాలలకు అనుసంధానం

ఇప్పటికే భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాల గల పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎంత గానో కృషి చేస్తోంది. ఈ కేంద్రాల్లో వారికి విద్యాబుద్ధులూ నేర్పింది. గత ఏడాది నుంచి భవిత కేంద్రాల సమీప పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య అభ్యసనకు శ్రీకారం చుట్టింది. శారీరక, మానసిక వైకల్యం బారిన పడిన పిల్లలకు తమను ప్రత్యేకంగా విభజించారనే భావన కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక పాఠశాలల సమీప భవిత కేంద్రాలను వాటితో అనుసంధానించింది. సాధారణ పిల్లలతో కలిసి వీరు విద్యా బుద్ధులు నేర్చుకోవడం ద్వారా వారిలో ఆలోచనలు వృద్ధి చెందుతాయన్నది సర్కారు భావన. దీనికోసం మండలానికి ఒక పాఠశాలను ఎంపిక చేసి భవిత కేంద్రాల బాలలను ఆయా పాఠశాలల్లో విలీనం చేశారు. అక్కడ ఐఈఆర్‌పీలతో పిల్లలకు విద్య బోధిస్తారు. మధ్యాహ్న భోజనం, విద్యా కానుక కిట్లు, విద్యా దీవెన వంటి సౌక ర్యాలు కల్పిస్తారు. ఫిజియోథెరపీవ్యాయామం, స్పీచ్‌ థెరపీ, యోగా అంశాల్లో శిక్షణనిస్తారు.

చేరితే బహుళ ప్రయోజనాలు

పల్నాడు జిల్లాలో ఇలా..

జిల్లాలో గడప గడపకు

భవితా కేంద్రాల ఐఈఆర్‌పీలు

ఈనెల ఒకటిన ప్రారంభమైన

సర్వే జూన్‌ 9వరకు కొనసాగింపు

కొత్తగా 75 మంది ప్రత్యేక

అవసరాల పిల్లలు గుర్తింపు

వారి ఆరోగ్యం, విద్యపై సర్కారు ప్రత్యేక శ్రద్ధ

సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ

ప్రయోజనాలు అందించడానికి కృషి

ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తిస్తున్నాం

జిల్లాలో ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించడంలో ఐఈఆర్‌పీలు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు కొత్తగా 75 మందిని గుర్తించాం. దివ్యాంగులు బడిబాట పట్టేలా సర్వే ముమ్మరం చేశాం. చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూనే సాధారణ విద్య బోధిస్తారు. వైకల్యం కలిగిన పిల్లల్లో సామర్థ్యాన్ని పెంచేందుకు సహిత విద్య తోడ్పడుతుంది. వైకల్యానికి అనుగుణంగా పరికరాలు ఉపయోగించి వారికి లైఫ్‌ స్కిల్స్‌ నేర్పించడం ద్వారా తోటి విద్యార్థులతో కలిసి చదువుకునేలా కృషి చేస్తున్నాం. ప్రత్యేక అవసరాల పిల్లలను చైతన్యపరిచి భవిత కేంద్రాలకు రప్పించి అక్కడ విద్యాబుద్ధులు నేర్పించడమే లక్ష్యం.

– కె.శ్రీనివాసరావు, ఇన్‌క్లూజివ్‌

ఎడ్యుకేషన్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌, పల్నాడు

ప్రత్యేక అవసరాలు గల పిల్లలు భవిత కేంద్రాల్లో చేరితే బహుళ ప్రయోజనాలు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చదువుకునే దివ్యాంగులకు ఉచితంగా అవసరమైన అన్ని ఉపకరణాలూ మంజూరవుతాయి. పాఠశాలల్లో చేరే వారికి ప్రతి నెలా రూ.300 చొప్పున రవాణా భత్యాన్ని చెల్లిస్తారు. వినికిడి, దృష్టిలోపం ఉన్నవారికి ఉచితంగా ట్యాబ్‌లు అందజేస్తారు. 9వ తరగతి విద్యార్థులు నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ కం స్కాలర్‌షిప్‌ పరీక్షలో ఎంపికైతే ఏడాదికి రూ.12 వేలు చొప్పున వరుసగా నాలుగేళ్లు అందిస్తారు. బాగా రాణించేవారికి ఉన్నత విద్య, ఉపాధికి అవకాశాలు ఉన్నాయి. వైకల్య శాతం అధికంగా ఉన్నవారికి సదరం ధ్రువ పత్రంతో పింఛన్‌ లభిస్తుంది. బస్సులు, రైలులో ప్రయాణానికి పాస్‌ సదుపాయం వర్తిస్తుంది. పాఠశాలకు రాలేని వారి ఇళ్ళకే ఉపాధ్యాయులు వచ్చి అవసరమైన బోధనతో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇలాంటి వారికి పాఠశాలలకు వచ్చినట్లే హాజరు నమోదు అవుతుంది.

బంగారు భవిత బాటన
1/2

బంగారు భవిత బాటన

బంగారు భవిత బాటన
2/2

బంగారు భవిత బాటన

Advertisement
 
Advertisement
 
Advertisement