
తెనాలి: తెనాలికి చెందిన సాహితీ, సాంస్కృతిక సంస్థ కళల కాణాచి పాల్గొన్న తొలి పరిషత్ పోటీల్లోనే ప్రదర్శించిన సాంఘిక నాటికకు ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం బహుమతులతో జయకేతనం ఎగురవేసింది. ప్రథమ బహుమతి కింద భారీనగదు మొత్తం రూ.3 లక్షల నగదును వ్యవస్థాపకుడు, ప్రసిద్ధ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, దర్శకుడు డాక్టర్ ఎంఎస్ చౌదరి, నటీనట బృందం స్వీకరించింది. గోదావరి జిల్లాలోని రావులపాలెంలో సీఆర్‌సీ కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సాంఘిక నాటికల పోటీలను నిర్వహించారు. ప్రముఖ సినీనటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి గౌరవ అధ్యక్షుడిగా ఉన్న పరిషత్ నిర్వహించిన ఈ పోటీల్లో పోటీలకు దేశంలో మరెక్కడా లేనివిధంగా ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయానికి రూ.2 లక్షలు, తృతీయానికి రూ.లక్ష నగదును ప్రకటించారు. వీణా అవార్డ్స్ పేరుతో రాష్ట్రస్థాయి సాంఘిక నాటిక, పద్యనాటక పోటీలను నిర్వహిస్తున్న కళల కాణాచి సంస్థ, తొలిసారిగా రావులపాలెం పరిషత్ పోటీల్లో పాల్గొంది. డాక్టర్ సాయిమాధవ్ బుర్రా సమర్పణలో ‘అంధస్వరం’ అనే డాక్టర్ ఎం.ఎస్.చౌదరి రచించిన నాటికను ఆయన దర్శకత్వంలోనే పోటీల్లో ప్రదర్శించారు. మానవతతో వ్యవహరించాల్సిన మనిషి మృగంలా ప్రవర్తిస్తున్న దుష్టాంతాలు నేటి సమాజంలో అనేకం... ముఖ్యంగా మహిళల పట్ల.
అంధస్వరం నాటికకు ఇదే ఇతివృత్తం. కలల కాణాచి, తెనాలి సమాజం రాష్ట్రస్థాయి పరిషత్ పోటీల్లో తొలి సారిగా ప్రదర్శించిన ఈ నాటికకు ఉత్తమ ప్రదర్శన, రచన, దర్శకత్వం బహుమతులు లభించం విశేషం. ఉత్తమ ప్రదర్శన కింద రూ.3 లక్షల పరితోషికాన్ని సినీనటుడు తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, నిర్వాహకుల చేతుల మీదుగా శుక్రవారం రాత్రి రావులపాలెంలో సాయిమాధవ్, ఎంఎస్ చౌదరి స్వీకరించారు. పద్యనాటక పోటీల్లో తెనాలి సమాజాలు నంది నాటకాలతో సహా అనేక పరిషత్తుల్లో బహుమతులు పొందుతున్నా, సాంఘిక నాటికల విభాగంలో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతిని గెలుచుకోవటం యాభై ఏళ్ల తర్వాత ఇదే ప్రథమమని కళల కాణాచి బృందం ఆనందం వ్యక్తంచేసింది.
రాష్ట్రస్థాయి పరిషత్ పోటీల్లో అంధస్వరం నాటికకు ప్రథమ బహుమతి
పారితోషికంగా రూ.3 లక్షల
నగదు బహూకరణ
ఉత్తమ ప్రదర్శనతోపాటు
రచన, దర్శకత్వం
‘సాంఘికం’లో తెనాలికి 50 ఏళ్ల
తర్వాత దక్కిన గౌరవం