
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 21 ఎమ్మెల్సీ స్థానాల్లో 17 ఎమ్మెల్సీ స్థానాలను వైఎస్సార్ సీపీ గెల్చుకుందని, వీటిలో నాలుగు ఓడిపోయినంత మాత్రాన పార్టీ శ్రేణులు బాధపడి అధైర్యపడాల్సిన పనిలేదని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలనేవి ప్రత్యేకంగా జరిగేవని, సాధారణ ఎన్నికలతో వాటిని పోల్చలేమని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రజల్లో ఉందని, ప్రజలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వివరించారు. ఓటర్లు అందరూ పార్టీ వైపే ఉన్నారని, వచ్చే 2024 ఎన్నిక ల్లో గెలిచి మళ్లీ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కావటం ఖాయమని చెప్పారు. ఇద్దరు, ముగ్గురి తీరు, ప్రవర్తనా బాగాలేకపోవటంతో వచ్చే ఎన్నికల్లో సీట్లు లేవని ముందుగానే తెలియచేయటంతో అసంతృప్తికి గురైన వారిని చంద్రబాబు కోట్లు చెల్లించి తనవైపునకు ఓట్లు వేయించుకున్నాడని ఆరోపించారు. సీఎం జగన్ నిజమైన హీరో అన్నా రు. ఎన్నికలకు ముందు మీకు సీట్లు లేవంటూ చెప్పిన ధైర్యశాలి అన్నారు. చంద్రబాబులాగా మాయమాటలు చెప్పటం జగన్‌కు తెలియదని చెప్పారు. గతంలో టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయ పదవులు జగన్ అప్పగించారన్నారు. కావటి మనోహరనాయుడికి పెదకూరపాడు టికెట్టు ఇవ్వలేకపోతే అతడికి గుంటూరు మేయర్‌గా అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్‌లకు ఎమ్మెల్సీ పదవులు అప్పగించారన్నారు. హెనీ క్రిస్టినాను జెడ్పీ చైర్‌పర్సన్‌గా చేయటం జరిగిందన్నారు. మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి సీఎం జగన్ అన్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పుటి నుంచే కష్టపడి పనిచేయాలని కోరారు.
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి