పర్లాకిమిడి: గుసాని సమితి గురండి గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన శివ హనుమాన్ మందిరం ప్రతిష్ట మహోత్సవంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు పాల్గొన్నారు. ఆయన హనుమాన్ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వాదం పొందారు. కార్యక్రమంలో గుసాని బీజేపీ నాయకులు రిట్టుపాత్రో, చిన్నా, మోహన్‌రావు, బబులా పట్నాయిక్, వాళ్ల చిట్టి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు
పార్వతీపురం: జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల గుర్తింపు, నమోదు కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. దృష్టి పోర్టల్‌లోని ఎక్సెల్ కంటెంట్ యాప్ ద్వారా జిల్లాలోని 26 మంది ఐఈఆర్‌పీలు 0–16 ఏళ్ల పిల్లను గుర్తించి స్క్రీనింగ్‌చేసి వారి వివరాలను నమోదు చేస్తున్నారు. 15 మండలాల పరిధిలోని 2,381 హేబిటేషన్‌లలో జూన్ 10 వరకు సర్వే కొనసాగనుంది. పట్టణంలో నిర్వహిస్తున్న సర్వేలో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఐఈఆర్‌టీ కోఆర్డినేటర్ భానుమూర్తి, ఎంఈఓ కె.ప్రసాద్ పాల్గొని ఆటిజం ఉన్న తోట శ్రావణ్ ప్రజ్వల్ అనే బాలుడిని గుర్తించారు. సర్వేతో దివ్యాంగ పిల్లలకు కచ్చితమైన డేటాసేకరణ, థెరపీ, విద్యాసేవలు, ఉపకరణాల పంపిణీ, అలెవెన్స్‌ల అమలు, తదితర కార్యక్రమాలు మెరుగుపడతాయని డీఈఓ తెలిపారు.
తోటపల్లి పరిసరాల్లో ఏనుగులు
గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లి పంచాయతీ పరిసరాల్లో పంట పొలాలు, తోటల్లో మంగళవారం ఏనుగుల గుంపు సంచరిస్తోంది. పదిరోజుల నుంచి గిజబ, తోటపల్లి, సుంకి, నందివానివలస తదితర గ్రామాల పరిసరాల్లో సంచరిస్తుండడంతో ప్రస్తుతం ఆయా గ్రామాల్లో అరటి, మొక్కజొన్న, పామాయిల్ తదితర పంటలు నాశనం చేస్తున్నాయని రైతులంటున్నారు. ప్రధాన రహదారికి సమీపంలో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భీతిల్లుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు అధికారులను కోరుతున్నారు.


