రాయగడ: నవ మాసాలు మోసి, కని పెంచిన కన్న తల్లే తన పిల్లలను కడ తేర్చింది. అత్యంత కర్కశంగా తన పిల్లలను పదునైన మరణాయుధంతో హతమార్చింది. ఝార్సుగుడ జిల్లా ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తంగరపల్లి ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఝార్సుగుడ పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఝార్సుగుడ ఆస్పత్రికి తరలించారు. ఝార్సుగుడ ఎస్పీ గుండాల రాఘవేంద్ర ఈ సందర్భంగా హస్పటల్‌కు వెళ్లి దర్యాప్తు చేశారు. డీఎస్పీ బనిత మాఝి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ఆదివారం నాడు జిల్లాలోని ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తంగరపల్లి ప్రాంతంలో నివసిస్తున్న రంజితా ఓరం అనే మహిళ తన పదేళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురుని అత్యంత దారుణంగా ఒక పదునైన మరణాయుధంతో హతమార్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. తన భర్త వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె ఈ దారుణానికి ఆమె ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అదేవిధంగా నిందితురాలి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు సమాచారం.


