అందని ప్రసాదం..! | - | Sakshi
Sakshi News home page

అందని ప్రసాదం..!

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

● అరసవల్లిలో ప్రసాదాలకు గ్యాస్‌ కష్టాలు ● టోకెన్లతో అన్నప్రసాదాలు అందిస్తున్న వైనం ● సగం మందికే అందుతున్న ప్రసాదాలు ● ఇబ్బందులు పడుతున్న భక్తులు

గ్యాస్‌ ప్రభావం..
● అరసవల్లిలో ప్రసాదాలకు గ్యాస్‌ కష్టాలు ● టోకెన్లతో అన్నప్రసాదాలు అందిస్తున్న వైనం ● సగం మందికే అందుతున్న ప్రసాదాలు ● ఇబ్బందులు పడుతున్న భక్తులు

అరసవల్లి: ఎక్కడో అమెరికా–ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో నిత్యాన్న ప్రసాదంపై ప్రభావం చూపించింది. ఇప్పటికే గత నెల రోజులుగా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్‌ దొరక్క చాలా ప్రాంతాల్లో ఇటు వినియోగదారులు.. అటు ఫుడ్‌ మార్కెట్‌ వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే ఇంతవరకు లేని సమస్య.. ఇప్పుడిప్పుడే అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి తాకుతోంది. వంట గ్యాస్‌పై ఆధారపడుతూ రోజూ వందలాది మందికి అన్నప్రసాదాలను అందిస్తున్న ఆలయ వర్గాలకు ఈ గ్యాస్‌పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఇక్కడి అన్నప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీపై కూడా పెద్ద ప్రభావమే చూపుతోంది. అయితే ఫిక్స్‌డ్‌గా నంబర్‌ టోకెన్ల ద్వారా అన్నదాన ప్రసాదాలను అందజేస్తే గ్యాస్‌ కష్టాల నుంచి కొంతమేరకు గట్టెక్కవచ్చుననే భావనతో ఆలయ అధికారులు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ప్రసాదాలను కూడా ఒక పూట మాత్రమే విక్రయాలు చేసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి తాత్కాలిక విధానాలే అని.. గ్యాస్‌ కష్టాలు తీరిపోతే మళ్లీ అంతా యథావిధిగా జరుగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇదే నిర్థిష్ట టోకెన్ల విధానమే కొనసాగిస్తారనేలా భక్తుల్లో ఆందోళన నెలకొంది.

ఇండెంట్‌ ఇస్తున్నా..

అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో గ్యాస్‌ వినియోగం అధికంగానే ఉంటుంది. నిత్యం పులిహోర, లడ్డూ తయారీతో పాటు.. ప్రధానంగా నిత్యాన్నదాన ప్రసాదాల తయారీ కోసం రోజుకు కనీసంగా 10 నుంచి 12 సిలిండర్ల వినియోగం తప్పనిసరి. సరాసరి నెలకు రూ.250 నుంచి 300 వరకు సిలిండర్లు వినియోగమవుతుంటాయి. అయితే ప్రత్యేక అనుమతుల ద్వారా ఆలయంలో భక్తుల అవసరాల నేపథ్యంలో కమర్షియల్‌ సిలిండర్లకు బదులుగా ఇక్కడ డొమస్టిక్‌ సిలిండర్లు (ఇంటికి వినియోగిస్తున్నవి) మాత్రమే వినియోగిస్తున్నారు. నిత్యం ఇక్కడ 800 నుంచి 1,000 మంది వరకు అన్నదాన ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. అయితే ఇప్పుడు గ్యాస్‌ కొరత కారణంగా నెలకు 300 వరకు సిలిండర్లు అవసరమంటూ ఇండెంట్‌ పెట్టినప్పటికీ, సగం మాత్రమే డెలివరీ అవుతున్నాయి. దీంతో ఈ ప్రభావం ఇటు భక్తులకు విక్రయించే ప్రసాదాలపైన, అటు అన్న ప్రసాదాల వంటల తయారీపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

రోజుకు 500 మందికే భోజనాలు

అరసవల్లి ఆలయంలో ప్రసాదాలుగా లడ్డూ, పులిహోరతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాదాలు స్వీకరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రాధాన్యమిస్తుంటారు. అయితే గ్యాస్‌ కొరత కారణంగా ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదాలను లెక్కమీద అందించాలని నిర్ణయించారు. ఆలయంలో దర్శనాలు ముగించుకుని వస్తున్న భక్తులకు ప్రత్యేకంగా ఉచిత అన్నప్రసాదాల టోకెన్లు పేరిట పరిమితంగా ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో గత కొద్ది రోజులుగా సగం మందికే అన్నప్రసాదాలు అందుతున్నాయి. మొన్నటి వరకు రోజుకు వెయ్యిమంది ప్రసాదాలను స్వీకరిస్తే.. నేడు కేవలం 500 మందికే పరిమితం చేశారు. ఆదివారాల్లో అయితే 3 వేల మంది వరకు గతంలో ప్రసాదాలకు వచ్చేవారు. ఇప్పుడు అంతా లెక్క మీద టోకెన్ల పేరుతో 1,200 మంది నుంచి 1,500 మంది వరకు భక్తులకు మాత్రమే అన్నప్రసాదాలను అందిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అదనంగా భోజనాలు పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వందలాది మంది భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాజాగా ఆదివారం అయితే చాలా మందికి భోజనాలు అందని పరిస్థితి కనిపించింది.

ఇదేం పద్ధతి..?

ఇటీవల ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి పనులు కాంట్రాక్టు క్రింద సుమారు 70 మంది వరకు కూలీలు రోజూ ఆలయం వద్ద పనులు చేస్తున్నారు. వీరు కూడా రోజూ ఈ నిత్యాన్నదాన పథకంలో ఉచితంగా భోజనం చేస్తున్నారు. వాస్తవానికి వీరికి సంబంధిత కాంట్రాక్టర్‌ బిల్లుల రూపంలో భోజనాలు పెట్టించాల్సి ఉంది. అయినప్పటికీ సదరు సబ్‌ కాంట్రాక్టర్‌ మాత్రం కూలీలకు ఎంచక్కా ఆలయంలోనే భోజనాలు పెట్టించేస్తున్నాడు. దీంతో దర్శనాలకు వచ్చిన భక్తులకు అన్నప్రసాదం దొరక్క వెనుదిరుగుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల భక్తులకు అన్నప్రసాదాలు అందడం లేదు..

తక్కువ మంది భక్తులు అన్నప్రసాదాలను

స్వీకరిస్తున్న దృశ్యం

Advertisement
 
Advertisement
Advertisement