భువనేశ్వర్: ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా ఊగిసలాడుతున్న నీటి పంపకాల వివాదం పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మహా నది జలాల పంపిణీ వివాదాల ట్రిబ్యునల్ (ఎండబ్ల్యూడీటీ) కాల పరిమితిని వచ్చే ఏడాది జనవరి 13 వరకు పొడిగించారు. మహానది నదిపై ఉన్న అంతర్ రాష్ట్ర వివాదాన్ని పరిష్కరించడానికి 2018లో ఈ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ మునుపటి కాల పరిమితి ఈ ఏడాది ఏప్రిల్ 13తో ముగియాల్సి ఉంది. ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాల ఉమ్మడి అభ్యర్థన మేరకు తీర్పు ప్రక్రియ సమర్థంగా పూర్తయ్యేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 9 నెలల కాల పరిమితి పొడిగింపును మంజూరు చేసింది. ఈ పొడిగింపు ఒడిశాకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు. మహా నది ఎగువ చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బ్యారేజీలు, ప్రాజెక్టుల వల్ల దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం దెబ్బతింటోందని ఒడిశా నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మహా నది జలాల పంపిణీ వివాదాల ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ పదవి దాదాపు 9 నెలల పాటు ఖాళీగా ఉండటంతో విచారణ ప్రభావితమైంది. దీంతో సరైన తీర్పు కోసం ఇరు రాష్ట్రాలు అదనపు సమయం కోరాయి. ప్రస్తుతం విచారణలు కొనసాగుతున్నాయి. మరో వైపు ట్రిబ్యునల్ ఇటీవల ఇరు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించింది. ట్రిబ్యునల్ గడువు పొడిగింపుతో సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించి వాదోపవాదాలు లోతుగా విచారించేందుకు దోహదపడి నిర్మాణాత్మకమైన తుది తీర్పు వెల్లడించేందుకు ఉపకరిస్తుందని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతోంది.


