సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తితో పాటు అతను అనుచరుడు అనపాన నగేష్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త, ఒక పత్రిక విలేకరి సదాశివ, మరికొందరు టీడీపీ కార్యకర్తలు శనివారం దాడిచేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళ్తే.. నౌపడ గ్రామానికి చెందిన అనపాన నగేష్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ చేయి అడ్డుపట్టి ఉమ్ము వేశాడు. అయితే అతని వెనుక ద్విచక్ర వాహనంపై వస్తున్న టీడీపీ కార్యకర్త, విలేకరి సదాశివ కాలుపై పడింది. దీంతో సీతానగరం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆపి కావాలనే నా మీద ఉమ్ము వేశావని.. సారీ చెప్పమని నగేష్‌కు సదాశివ సూచించాడు. అయితే కావాలని తాను చేయలేదని అనడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్నవారు ఇరువురికీ నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు. అంతటితో సదాశివ ఆగకుండా కొంతమంది టీడీపీ కార్యకర్తలతో వెళ్లి.. పార్టీ కార్యాలయంలో ఉన్న అనపాన నగేష్‌ను పిలిచి దాడి చేశారు. ఇరువురూ కొట్టుకోవడంతో ఈ దాడిని అడ్డుకోవడానికి వెళ్లిన మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తిపై సైతం దాడి చేశారు. ఈ దాడిలో విష్ణుమూర్తి కళ్లజోడు విరిగిపోగా, కాళ్లకు గాయమై రక్తస్రావం అయింది. దీనిపై ఇరువర్గాలు పరస్పరం నౌపడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అనపాన నగేష్ ఫిర్యాదు మేరకు సదాశివ, తిప్పాన కామరాజు, కీలుగు సత్యంపై.. సదాశివ ఫిర్యాదు మేరకు అనపాన నగేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపారు.


