ఆదిత్యుని సన్నిధిలో గజపతి కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని సన్నిధిలో గజపతి కలెక్టర్‌

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా కలెక్టర్‌ అక్షయ్‌ సునీల్‌ అగర్వాల్‌ కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు.గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

కౌన్సిలింగ్‌ బుక్‌ ఆవిష్కరణ

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కేఎల్‌ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్‌, డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం రూపొందించిన కౌన్సిలింగ్‌ బుక్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు, ప్రత్యేకతలు, మౌలిక వసతులు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిఏటా రూ.100 కోట్ల స్కాలర్‌షిప్స్‌ మెరిట్‌ విద్యార్థులకు అందించే ప్రణాళిక విషయమై ప్రశంసించారు. యూనివర్సిటీలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌తో పాటు వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థుల గురించి యూనివర్సిటీ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.శ్రీనివాసరావు తెలియజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్‌ ఇన్‌చార్జి రాధాకృష్ణ, సీనియర్‌ మేనేజర్స్‌ కుమార్‌, రెడ్డి, నరసింహులు, వెంకట్‌ పాల్గొన్నారు.

కోర్‌ ఇంజినీరింగ్‌తో అపారమైన అవకాశాలు

టెక్కలి: కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లతో భవిష్యత్‌లో అపారమైన అవకాశాలు ఉంటాయని అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌.సుదర్శనరావు అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ స్థాయి అధ్యాపక శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృత్రిమ మేథస్సు, ఆధునిక సాంకేతిక రంగాల అభివృద్ధితో కోర్‌ ఇంజినీరింగ్‌ విభాగాలు కొత్త దిశగా ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. ఇంజినీరింగ్‌ కళాశాలలు సమకాలిన అవసరాలకు అనుగుణంగా కోర్సులను విస్తరించాలని సూచించారు. సాంకేతిక రంగంలో వేగవంతంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులకు సాంకేతిక శిక్షణ తరగతులు అందజేసి తద్వారా విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఐఎస్‌టీఈ–2026 వార్షిక అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. కళాశాల డైరక్టర్‌ వీవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 2007లో ఐఎస్‌టీఈ మెంబర్‌ షిప్‌తో అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2014 నుంచి 2026 వరకు తమ కళాశాలలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ అవార్డులను అందజేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఐఎస్‌టీఈ అధ్యక్షుడు ప్రతాప్‌ సింహాకసాహెబ్‌ దేశాయ్‌, జేఎన్‌టీయూ జీవీ పూర్వపు వీసీ ప్రొఫెసర్‌ కట సుబ్బయ్య, ఐఎస్‌టీఈ ఏపీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జి.రంగ జనార్ధన, కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్‌.ఎల్‌.నాయుడు, డైరక్టర్‌ కె.మధుకుమార్‌, ప్రిన్సిపాల్‌ ఎ.ఎస్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

హిరమండలంలో చోరీ

హిరమండలం: హిరమండలం మేజర్‌ పంచాయతీ దేవరశెట్టి వీధిలోని అందవరపు కస్తూరి ఇంట్లో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కొత్తూరు సీఐ సీహెచ్‌ ప్రసాదరావు, హిరమండలం, కొత్తూరు ఎస్‌ఐలు వై.మధుసూదనరావు, కె.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌ బృందం, జాగిలాలను తెప్పించారు. ఇంటి యాజమాని అందవరపు కస్తూరి పొలాకిలోని తన కన్నవారింటికి వెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చోరీ సంఘటనపై కొత్తూరు సీఐ వద్ద ప్రస్తావించగా దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement