గడ్డిమందు తాగి ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గడ్డిమందు తాగి ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

పాతపట్నం: మండలంలోని చిన్నలోగిడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ దయానిధి సోయి(30) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నలోగిడి గ్రామానికి చెందిన దయానిధి సోయి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త జైనవలస చిలకమ్మకు రూ.3 లక్షలు అప్పు ఇచ్చాడు. చిలకమ్మకు ఐదు రోజుల క్రితం డబ్బులు అడగగా.. చిలకమ్మ, ఆమె భర్త ముఖలింగంలు కలిసి పోలీసుస్టేషన్‌లో దయానిధిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దయానిధి సోయిని పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌లోనే దయానిధి సోయిని చిలకమ్మ ధూషించింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఈనెల 10వ తేదీన గడ్డిమందు తాగాడు. అనంతరం ఆటోలో సెల్ఫీ వీడియో తీశాడు. తన మృతికి పెద్దలోగిడి ఆశ వర్కర్‌ జైనవలస చిలకమ్మ, ఆమె భర్త మొఖలింగంలు కారణమని, అప్పు ఇచ్చిన డబ్బులు అడిగితే తనపై కేసు పెట్టారని వాపోయాడు. వీడియోని చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు దయానిధిని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించగా, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. రిమ్స్‌లో పంచనామా , పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ కె.శ్రీరామమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

‘దమ్ముంటే రాజీనామా చెయ్‌’

పాతపట్నం: మహానేత మరణంపై, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మంత్రి ఇలా వాఖ్యలు చేయడం దగదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురా లు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా ఖండించారు. శనివారం మాజీ ఎమ్మె ల్యే క్యాంప్‌ కార్యాలయంలో రెడ్డి శాంతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసం మరణించిన వ్యక్తిపై బురద చల్లడం మంత్రి అచ్చెన్నాయుడికి తగదన్నారు. ఎర్రన్నాయుడు మరణిస్తే గానీ మంత్రి పదవి రాదు అని అచ్చెన్న సహచరుల వద్ద ఎన్నోసార్లు అన్నారని గుర్తు చేశారు. దమ్ముంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు అచ్చెన్న రాజీనామా చేసి, పోటీ చేయాలని, డిపాజిట్‌ కూడా రాదని అన్నారు. సమావేశంలో పాతపట్నం, మెళియాపుట్టి పీఏసీఎస్‌ అధ్యక్షులు మిరి బిల్లి శ్యామ్‌సుందరరావు, ఉర్లాన బాలరాజు, పాతపట్నం, మెళియాపుట్టి, ఎల్‌.ఎన్‌.పేట పార్టీ మండల అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్‌, పోలాకి జయమునిరావు, పెనుమజ్జి విష్ణుమూర్తి, కొత్తూ రు ఎంపీపీ సవర సావిత్రి, రాష్ట్ర బీసీ సెఎల్‌ జాయింట్‌ సెక్రటరీ చింతాడ సూర్యనారాయణ, రాష్ట వాణిజ్య విభాగం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ యరుకోల వెంకటరమణ, రాష్ట్ర ఎస్టీ సెల్‌ జాయింట్‌ సెక్రటరీ రమేష్‌, రెడ్డి రామారావు, మడ్డు తాతయ్య, వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement