తీరానికి చేరిన తిమింగలం కళేబరం | - | Sakshi
Sakshi News home page

తీరానికి చేరిన తిమింగలం కళేబరం

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

భువనేశ్వర్‌: కేంద్రాపడా జిల్లా గహిర్‌మఠ్‌ సముద్ర అభయారణ్యం ప్రాంతం మదాలి నది ముఖ ద్వారం సమీపంలో భారీ నీలి తిమింగలం కళేబరం ఒడ్డుకు చేరింది. స్థానికులు వెంటనే మండల అటవీ అధికారి (డీఎఫ్‌ఓ)కు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ కపిలేంద్ర ప్రధాన్‌, జంతు వైద్య అధికారి డాక్టర్‌ ప్రకాష్‌ కుమార్‌ జెనా ఆధ్వర్యంలో ప్రత్యేక బందం ఘటనా స్థలం సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రాథమిక పరీక్షలో సుమారు 4 నుంచి 5 ఏళ్ల వయసు కలిగిన ఆడ తిమింగలంగా ధ్రువీకరించారు. కళేబరం దాదాపు సగం కుళ్లిపోయినట్లు గుర్తించారు. 12 నుంచి 15 రోజుల క్రితం సముద్రంలోనే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. కళేబరం నుంచి తీవ్ర దుర్వాసన వెలువడడంతో లోతుగా పరిశీలించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. బలమైన గాలులు, ఆటుపోట్ల ప్రవాహాలతో కళేబరం ఒడ్డుకు చేరి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మరణానికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. చేపల వేట పడవను ఢీకొనడం, ఇతర తెలియని కారణాలు కావచ్చని చెబుతున్నారు. ఐదేళ్ల కిందట ఇదే ప్రాంతంలోని చించీరి నదీ ముఖ ద్వారం, కొంతియా ఖాయ్‌ సమీపంలో 2 భారీ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. గహిర్‌మఠ్‌ తీరం నీలి తిమింగలాలు, ఇతర సముద్ర జీవజాతులు కనిపించే ముఖ్యమైన సముద్ర ఆవాసాలలో ఒకటిగా నిలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement