కొరాపుట్: కేంద్ర రక్షణ దళాలలో ఒకటైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) 61వ శౌర్య దివాస్ ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో జానకీనగర్‌లో 12వ బెటాలియన్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రం సమీపంలో మవుళీ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ హరిజన్ 2009 ఏప్రిల్ 16న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులతో పోరాటం చేస్తూ అమరుడయ్యాడు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులైన హేమలత్ హరిజన్, బుధన్ హరిజన్‌లను బెటాలియన్ ఆహ్వానించి గౌరవ సత్కారం చేశారు. కార్యక్రమంలో కమాండెడ్ ఎన్‌కేకే ప్రసాద్, డిప్యూటీ కమాండెడ్ రాజీవ్‌కుమార్, అసిస్టెంట్ కమాండెడ్ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ సుజిత్ కుమార్, పీకే సాహు, సబ్ ఇన్‌స్పెక్టర్ బంద్ నామ్‌దేవ్ పాల్గొన్నారు.


