భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ 38వ సమావేశం లోక్ సేవా భవన్‌లో శుక్రవారం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి మండలి కీలక తీర్మానాల వివరాలను ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ మీడియాకు వివరించారు. మంత్రి మండలి ఆమోదం కోసం 5 శాఖలు 11 ప్రతిపాదనలు ప్రవేశ పెట్టాయి. ప్రధాన ప్రతిపాదనలలో పార్వతీ గిరి మెగా లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమంలో భాగంగా రూ. 626 కోట్ల వ్యయ ప్రణాళికతో హదువా ప్రాజెక్ట్ పథకానికి మంత్రి మండలి ప్రాధాన్యత కల్పించింది. సోన్‌పూర్, సంబల్‌పూర్, జాజ్‌పూర్, కెంజొహర్, మయూర్‌భంజ్, కటక్ లబ్ది పొందుతాయి. మెట్ట, కరువు పీడిత ప్రాంతాల్లో పంటల వైవిధ్యీకరణ (వాణిజ్య పంట లు) ప్రోత్సాహానికి సూక్ష్మ నీటిపారుదల సౌకర్యా లు అందుబాటులోకి తెస్తారు.
అటల్ బస్ స్టాండ్ పథకం..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే లక్ష్యంతో రూ. 3,400 కోట్ల వ్యయంతో రూపొందించిన ప్రతిష్టాత్మక అటల్ బస్ స్టాండ్ పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2031–32 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకీకృత నిర్వహణ కింద రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, సబ్ డివిజన్లు, మండలాలు, పట్టణ స్థానిక సంస్థలు, పర్యాటక కేంద్రాల్లో బస్ స్టాండ్‌ల ఆధునీకరణ పూర్తి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో ప్రాధాన్యతకు అనుగుణంగా ఎ, బి, సి తరగతులుగా వర్గీకరించి బస్ స్టాండ్లలో ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఉభయ వర్గాలకు అవకాశం కల్పించేందుకు మంత్రి వర్గం అంగీకరించింది.
318 బస్టాండ్‌ల ఉన్నతీకరణ..
రాష్ట్ర వ్యాప్తంగా 318 బస్ స్టాండ్‌లను ఉన్నతీకరించనున్నారు. ఈ చర్య ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, రవాణా అనుసంధానా న్ని బలోపేతం చేస్తుందని మంత్రి మండలి అభిప్రాయపడింది.
మౌలిక సదుపాయాల పెంపు..
రాష్ట్రంలో అత్యంత ఖనిజ సంపద కలిగిన ప్రాంతాలలో అధిక విద్యుత్ వినియోగం గల అనేక భారీ పరిశ్రమలకు కేంద్రంగా వెలుగొందుతున్న జోడా, బర్బిల్, పలాస్‌పంగ్ ప్రాంతంలో ఉన్న గ్రిడ్ సబ్–స్టేషన్లు ప్రస్తుతం గరిష్ట సామర్థ్యంతో పని చేస్తున్నాయి, అదనపు మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కెంజొహర్ జిల్లా బాసుదేవ్‌పూర్‌లో అనుబంధ ట్రాన్స్‌మిషన్ లైన్లతో పాటు జీఐఎస్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది. రూ. 1,647.00 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును ఓపీటీసీఎల్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 494.10 కోట్ల 30 శాతం ఈక్విటీ మద్దతు కల్పిస్తుంది.
కార్మిక సేవా నిబంధనలకు సవరణ..
ఒడిశా కార్మిక సేవా (నియామక విధానం, సేవా నిబంధనలు) నియమావళి, 2019 సవరణలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ మార్పుల ప్రకారం 2019లో ఈ నియమావళి అమల్లోకి రాకముందు నియమితులైన సహాయ కార్మిక అధికారు లు, గ్రామీణ కార్మిక ఇన్‌స్పెక్టర్లకు శాఖాపరమైన పరీక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది.
కటక్ మండలాల కోసం నీటిపారుదల ప్రాజెక్ట్..
కటక్ జిల్లాలోని నరసింహపూర్, బొడొంబ, టిగిరి యా మండలాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న హదువా నీటిపారుదల ప్రాజెక్టుతో కరువు పీడిత ప్రాంతాల్లోని 3,641 హెక్టార్ల సాగు భూమికి హామీతో కూడిన నీటిపారుదల అందించేందుకు ఖరోడ్ గ్రామం సమీపంలో హదువా నదిపై ఒక జలాశయంతో పాటు పంపిణీ వ్యవస్థను నిర్మిస్తున్నారు. హదువా డ్యామ్ నిర్మాణం ఇప్పటికే పురోగతిలో ఉంది.


