జయపురం: జయపురం–నవరంగపూర్, జయపురం–మల్కనగిరి రైల్వే ప్రాజెక్టుల వలన ప్రభావితులైన బాధితులకు నష్ట పరిహారం అందజేసేందుకు గురువారం సభ నిర్వహించారు. జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి జేఝారి గ్రామంలో నిర్వహించిన నష్టపరిహార ప్రధాన కార్యక్రమంలో నవరంగపూర్ పార్లమెంట్ సభ్యులు బలభద్ర మఝి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జయపురం– నవరంగపూర్, జయపురం–మల్కనగిరి రైల్వే ప్రాజెక్టులు ఆదివాసీల అభ్యున్నతి, నవరంగపూర్, కొరాపుట్, మల్కనగిరి జిల్లాల ప్రజల ఆర్థిక, సామాజిక ప్రగతికి దోహదపడతాయని ఎంపీ అన్నారు. ఈ రెండు రైల్వే ప్రాజెక్టల వలన జయపురం సబ్‌డివిజన్‌లో జయపురం, బొరిగుమ్మ, బొయిపరిగుడ,, కుంద్రా సమితుల్లో భూములు కోల్పోయిన బాధిత ప్రజలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొదటి విడత 30 మంది బాధిత కుటుంబాలకు నష్ట పరిహారంగా రూ.15 కోట్లను ఎంపీ, అతిథులు అందజేశారు. జయపురం నుంచి నవరంగపూర్, జయపురం నుంచి మల్కనగిరి కొత్త రైల్వే ప్రాజెక్టుల కోసం 700 హెక్టర్ల భూమి సేకరించటం జరుగుతుందని సూచన ప్రాయంగా వెల్లడించారు. మిగతా వారికి త్వరలోనే పరిహారం చెల్లించటం జరుగుతుందని ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, బొరిగుమ్మ పంచాయతీ సమితి అధ్యక్షుడు దీప్తి మయి నాయక్, రైల్వే, రెవెన్యూ అధికారులు, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రైల్వే ప్రాజెక్టుల వలన భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ప్రధాన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నవరంగపూర్ పార్లమెంట్ సభ్యులు బలభధ్ర మఝికి ప్రజలు, బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.


