ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

జయపురం: రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైనంత ఎరువులు సమకూర్చే విషయంపై చర్చించేందుకు గురువారం వ్యవసాయ అధికారులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు ఎరువులు కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ ఎరువుల విక్రేతగా నియమించిన మార్క్‌ఫెడ్‌, ప్రాంతీయ సహకార మార్కెటింగ్‌ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశం మేరకు జయపురం ప్రధాన వ్యవసాయ అధికారి సంతోష్‌ కుమార్‌ ధళబెహర అధ్యక్షతన జరిగిన సమావేశంలో రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో ముఖ్యంగా ధాన్యం రైతులకు అవసరమైన యూరియా, పొటాస్‌, తదితర ఎరువులు ఎలా సమకూర్చాలన్న దానిపై చర్చించారు. గత ఏడాది యూరియా కొరత ఏర్పడిన విషాయాన్ని గుర్తుచేసిన అధికారులు, ఈ ఖరీఫ్‌ సీజన్‌లో అటువంటి పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ఎరువుల కంపెనీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఎరువుల విక్రేతలు.. గుర్తింపు కార్డులు ఉన్న రైతులకే ఎరువులు అమ్మాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సహకార విభాగం డిప్యూటీ రిజస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటీవ్‌, మనోస్‌ రాయ్‌, జయపురం సహాయ వ్యవసాయ అధికారి లలిటేందు మహాపాత్ర, నందపూర్‌ వ్యవసాయ విభాగ సహాయ అధికారి సుజాత నిశంకొ, కొరాపుట్‌ వ్యవసాయ అధికారి కహ్నూచరణ దాస్‌, ఎరువుల సరఫరా విభాగ అధికారి సంగీత బెహరా, తదితరులు పాల్గొన్నారు. ఎరువులు నల్ల బజారుకు వెళ్ల కుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ విభాగ అధికారి సంబంధిత వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులకు ఎరువులు అమ్మే సమయంలో రైతుల గుర్తింపు కార్డులు పరిశీలించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అమ్మాలని, ఎరువులు నిల్వ ఉంచేందుకు గొదాంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement