లాభం కోసం కాదు..
● విద్యాసేవలో తనదైన మార్క్ చాటుకుంటున్న శంకరరావు ● తక్కువ ఫీజుతో అడ్మిషన్లు ● 10 మంది పేదలకు ఉచిత వద్య
రాయగడ: పేదరికంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి.. సమాజానికి వెలుగునిచ్చే విద్యాసేవలో తనదైన మార్క్‌ను చాటుకుంటున్నారు ప్రముఖ విద్యా సేవకుడు బుడ్డా శంకరరావు. ఉపాధి అవకాశాలు ఎన్నో వచ్చినప్పటికీ వాటిని కాదని విద్యారంగంలో స్థిరపడ్డారు. దీనిలో భాగంగా స్థానిక కస్తూరీనగర్‌లో 2007లో పది మంది పిల్లలతో మదర్ థెరిస్సా పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలలో ఉత్తమ విలువలతో కూడిన విద్యా బోధన అందించడంతో క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరిగి పదో తరగతి వరకు చేరుకుంది. నర్సరీ నుంచి ప్రారంభమైన పాఠశాల నేడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో సదరు సమితి పరిధి కొత్తపేట పంచాయతీ కొల్లిగుడ వద్ద 2017లో మదర్ థెరిస్సా టెక్నో స్కూల్ పేరిట మరో బ్రాంచ్ ప్రారంభించారు. ఆదివాసీలు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో వారి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఫీజులు తీసుకుంటూ విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా పది మంది విద్యార్థులను ఉచితంగా తమ పాఠశాలలో చదివిస్తూ అవసరమైన విద్యా సామగ్రి సమకూరుస్తున్నారు.
ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలి
యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే సమయాన్ని వృథా చేసుకోకుండా స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని ఆయన సూచించారు. తమ విద్యాసంస్థల్లో సుమారు 60 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని వివరించారు. విద్యను వ్యాపార దృక్పథంతో చూడకుండా.. నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్‌కు దిశా నిర్దేశం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో తనతో పాటు తన సోదరుడు సంతోష్ కుమార్ చేదోడుగా వ్యవహరిస్తుండడంతో సంస్థ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ ట్రస్టుకు కార్యదర్శిగా తన సోదరుడు విధులు నిర్వహిస్తుండడం తన విజయానికి మరో కారణంగా వివరించారు.
త్వరలో ఇంటర్మీయడిట్ తరగతులు
మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా మరో మైలురాయిని చేరుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని ట్రస్టు ఎండీ శంకరరావు తెలియజేశారు. ప్లస్ –టూ సైన్స్, ఆర్ట్స్ తరగతులను త్వరలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్‌లతో ప్రారంభమవ్వనున్న ఈ తరగతుల్లో జేఈఈ, ఎన్‌ఐఐటీ, ప్రొఫెషనల్, అడ్వాన్స్‌డ్ కోర్సుల శిక్షణ కూడా కల్పించేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


