జయపురం: జయపురం– కొరాపుట్ 26వ జాతీయ రహదారి ఘాట్ రోడ్డులో బుధ వారం రాత్రి ట్రక్కు బ్రేక్ ఫైల్ అయి అదుపుతప్పి ప్రమాదానికి లోనైంది. ట్రక్కు జయపురం వైపు వస్తూ బ్రేక్ ఫెయిల్ కావటంతో ఘాట్ రోడ్డు రక్షణ గోడపై నుంచి 80 అడుగుల కిందకు జారిపడింది. ట్రక్కు డైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందిన జయపురం సదర్ పోలీసులు వెంటనే సంఘటన ప్రాంతానికి చేరి అగ్నిమాపక విభాగానికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 80 అడుగుల లోతున పడి న ట్రక్కును తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ట్రక్కు డ్రైవర్‌ను వెంటనే జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్‌కు తరలించారు.
ఒడియా సాహిత్యం, చరిత్ర పుస్తకాల విక్రయాలు
పర్లాకిమిడి: ఒడియా సాహిత్యం, చరిత్ర, ప్రబంధాలు, కవితల పుస్తకాల సంపుటాలు స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిపారు. ఒడియా దివాస్ పక్షోత్సవాలు సంధర్బంగా స్థానిక రచయితలు, కవులే కాక భువనేశ్వర్ నుంచి ప్రింట్‌అయి వచ్చిన పుస్తకాలు కూడా స్టాల్‌లో అమ్మకాలు జరిపారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మునీంద్ర హానగ, జిల్లా అబ్కారీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ సాహు, జిల్లా సామాజిక సంక్షేమశాఖ అధికారిని మనోరమా దేవి, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్‌లు కూడా పాల్గొని ప్రోత్సహించారు.
‘శాంతి నెలకొల్పాలి’
రాయగడ: పోలీసులు, ఆదివాసీల మధ్య జరిగిన దమనకాండలో ఇటు పోలీసులు అటు ఆదివాసీలు కూడా గాయాలపాలయ్యారని, ఈ పరిస్థితిని అధిగమించి కాశీపూర్‌లో శాంతియుతమైన వాతావరణం నెలకొల్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అన్నారు. ఆయన కాశీపూర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి సొషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు రాత్రి వేళ కాకుండా ఉదయం గ్రామానికి వెళ్లి నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే ఈ గొడవ జరిగి ఉండేది కాదన్నారు. ఆదివాసీలపై పోలీసుల అమానుష ప్రవర్తనను ఆయన ఖండించారు. నియమనిబంధనల ప్రకారం కాశీపూర్‌లో గల ఖనిజ నిక్షేపాలను తవ్వుకుంటే ఏ సమస్యా ఎదురయ్యేది కాదన్నారు. ప్రజల అభిమతం తెలుసుకోకుండా వ్యవహరిస్తే వారి నుంచి ఇలాంటి తరహా ప్రతిఘటనలే ఎదురవుతాయన్నారు.
వచ్చే వారం నుంచి ఉక్కపోత
భువనేశ్వర్ : భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ నెల 12 నుంచి 14 తేదీల మధ్య రాష్ట్రంలో తీవ్రమైన వేడి, ఉక్కపోత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. కాల వైశాఖి ప్రభావం గురువారం నుంచి బలహీనపడుతంది. ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొనడం ప్రారంభం అవుతుంది. రాగల 2 రోజులు పగటి ఉష్ణోగ్రతలు నిలకడగా కొనసాగుతాయి. తదుపరి రాబోయే రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రత 4 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ సమయంలో ముఖ్యంగా ఆరుబయట పని చేసే కార్మికులు, వృద్ధులు, పిల్లలతో సహా ప్రజలు అధిక సమయం ఎండలో ఉండకుండా తరచూ తగినంత నీరు తాగుతూ ఉండాలని భారత వాతావరణ శాఖ కోరింది.


