జయపురం: కొరాపుట్ జిల్లాలోని ఆదివాసీ ప్రజలకు ప్రకృతి వనరులపై హక్కులు కల్పించాలని సోషలిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు)(ఎస్‌యూసీఐ) జిల్లా కార్యదర్శి కనూచరణ్ బిశ్వాల్ అన్నారు. కొరాపుట్ జిల్లా కార్యకర్తలతో జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ బొయిపరిగుడ సహిద్ లక్ష్మణ నాయక్ గ్రంథాలయ ప్రాంగణంలో బుధవారం సమావేశం నిర్వహించారు. కనూచరణ్ బిశ్వాల్ మాట్లాడారు. దేశంలో నేడు మత రాజకీయాలు, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలనలో ప్రజలు పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. కొరాపుట్ జిల్లా ఆదివాసీలు స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య భూమిక వహించారన్నారు. ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడిన చరిత్ర ఉందన్నారు. నేడు అడవులు, ప్రకృతి సంపదలపై ఆదివాసీ ప్రజలకు హక్కులు కల్పించాలన్నారు. పరిశ్రమలలో ఆదివాసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నేటి పాలకులు ప్రజలను పీడిస్తున్నారని, వారి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సమైఖ్యంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ప్రజా పోరాటాలకు ప్రజలను సంఘటితపరిచి ఎస్‌యుసీఐ కార్యకర్తలు ఉద్యమించాలన్నారు. ఎస్‌యూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సదాశివ దాస్, రాష్ట్ర కార్యదర్శి శంకర దాస్, తదితరులు ప్రసంగించారు.


