‘అంకితభావం, సమర్థత కలిగిన ఉద్యోగులు సంస్థకు బలం’ | - | Sakshi
Sakshi News home page

‘అంకితభావం, సమర్థత కలిగిన ఉద్యోగులు సంస్థకు బలం’

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

భువనేశ్వర్‌: సమర్థంగా, కష్టపడి పనిచేసే ఉద్యోగుల వల్లే సంస్థ స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తుంది. వారే సంస్థకు శక్తివంతమైన సంపద, మూలధనమని హైటెక్‌ గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టరు తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్‌ ఆస్పత్రిగా హైటెక్‌ వైద్య బోధన ఆస్పత్రి రాష్ట్రం, జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జిస్తుంది. ఒడిశాలో ఆరోగ్య విద్య, చికిత్స, సేవల రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంస్థగా వెలుగొందుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమర్థమైన వైద్య, పారామెడికల్‌, నర్సింగ్‌, ఫార్మసిస్టులతో సంస్థ దినదిన ప్రవర్ధమానంగా ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యంగా ఈ సంస్థలో కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగానికి చెందిన సమర్థమైన వైద్య సిబ్బంది, ప్రొఫెసర్‌ డాక్టర్‌ రితేష్‌ కుమార్‌ ఆచార్య, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్మృతి ప్రకాష్‌ సాహు ప్రత్యేక ఆరోగ్య సేవలను అందిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుండి గౌరవాభిమానాలు చూరగొంటున్నారు. హైటెక్‌ గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి సంస్థలోని ప్రతి ఉద్యోగిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో హైటెక్‌ వైద్య బోధన ఆస్పత్రి ట్రస్టీ, డైరెక్టర్‌ మధుస్మిత త్రిపాఠి పాల్గొని దక్షత, నైపుణ్యత చాటుకున్న సిబ్బందిని ఉత్తరీయం, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ బెహెరా, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చందన్‌ సామంత్రాయ్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ శ్రద్ధ, జాగరూకతతో సేవలు అందించడంలో నిబద్ధత, సంకల్పంతో పని చేయాలని ప్రోత్సహించారు.

Advertisement
 
Advertisement
Advertisement