రాజ్య సభ నాయకత్వానికి సస్మిత్‌ పాత్రో రాజీనామా | - | Sakshi
Sakshi News home page

రాజ్య సభ నాయకత్వానికి సస్మిత్‌ పాత్రో రాజీనామా

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

భువనేశ్వర్‌: డాక్టర్‌ సస్మిత్‌ పాత్రో బుధవారం రాజ్య సభలో బిజూ జనతా దళ్‌ (బీజేడీ) పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక రాజకీయ పరిణామంగా చర్చ ఊపందుకుంది. సస్మిత్‌ పాత్రో తన రాజీనామా పత్రం బిజూ జనతా దళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌కు సమర్పించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఎగువ సభలో నాయకత్వ మార్పు కోరుతూ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు నాయకత్వానికి లేఖ రాశారన్న వార్తల నేపథ్యంలో ఈ రాజీనామా చోటుచేసుకోవడం కలకలం రేపుతుంది. రాజ్య సభలో కొత్తగా ఎన్నికై న బీజేడీ ఎంపీ సంతృప్త్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సస్మిత్‌ పాత్రోను తొలగించాలన్న డిమాండ్‌ ఊపందుకుందని తెలిసింది. కొంత మంది ఎంపీలు తమ ఆందోళనలను అధినేత నవీన్‌ పట్నాయక్‌కు లాంఛనంగా తెలియజేసి నాయకత్వ పునర్వ్యవస్థీకరణకు ఒత్తిడి చేశారని పార్టీ అంతర్గత వర్గాలు సమాచారం. ప్రస్తుతం రాజ్య సభలో బీజేడీకి 6 మంది సభ్యులు ఉన్నారు. 2022 నుంచి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పని చేస్తున్న సస్మిత్‌ పాత్రో రాజ్య సభలో పార్టీ వైఖరిని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన రాజీనామాతో ఆ కీలక నాయకత్వ పాత్రను ఎవరు చేపడతారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. సంతృప్త్‌ మిశ్రా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సంతృప్త్‌ మిశ్రా తొలిసారిగా రాజ్య సభలోకి ప్రవేశించారు. డాక్టరు సస్మిత్‌ పాత్రో రాజీనామా లేదా తదుపరి కార్యాచరణకు సంబంధించి గానీ, బీజేడీ నాయకత్వం నుంచి గానీ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదా ప్రకటన వెలువడలేదు.

Advertisement
 
Advertisement
Advertisement