భువనేశ్వర్: ఇటీవల కురిసిన వడగళ్ల వాన వల్ల జరిగిన భారీ నష్టానికి పరిహారం కోరుతూ బొలంగీర్ జిల్లాలో స్థానికులు మంగళవారం రహదారిని దిగ్బంధించారు. పట్నగడ్, పద్మాపూర్ రహదారిపై పడేల్ కూడలి వద్ద నిరసన ప్రదర్శించారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వడగళ్ల వాన ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అధికార యంత్రాంగం, ప్రభుత్వం గానీ ఎలాంటి సహాయం అందించకపోవడంతో అసంతృప్తి పెరుగుతోందని గ్రామస్తులు ఆరోపించారు. తక్షణ సహాయం, నష్టపరిహారం కోసం ఒత్తిడి చేస్తూ స్థానికులు రహదారిని దిగ్బంధించారు. వడగళ్ల వాన కారణంగా అనేక కచ్చా ఇళ్ల పైకప్పులు దెబ్బతిని, ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు సమాచారం. వంట పాత్రలతో సహా నిత్య వినియోగ గృహోపకరణాలు దెబ్బతిన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విపత్తుతో జరిగిన నష్టాలను పూడ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.


