రాయగడ: మనస్తాపానికి గురైన ఉపాధ్యాయుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని గునుపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. మృతుడు గుణుపూర్‌లో గల శివశక్తి నగర్ రెండో నంబరు కాలనీలో నివాసముంటున్న కృష్ణ సేనాపతి (53)గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గుడారి సమితి డిమిరిగుడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సేనాపతి గత కొద్ది నెలలుగా పక్షవాతంతో మంచం పట్టారు. నడవలేని దుస్థిఽతి ఏర్పడింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేందుకు ఇష్టం లేక మానసికంగా ఆందోళన చెందారు. మనస్థాపానికి గురై ఇంటికి సమీపంలో గల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సబ్ డివిజన్ హాస్పటల్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


