అరసవల్లి: సూర్య నారాయణ స్వామి క్షేత్రంలో భక్తులు ఎండలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు పలు ఏర్పాట్లు చేసినప్పటికీ, భక్తులకు ఎండ నుంచి రక్షణ కోసం వేసిన టార్పాన్లు నాసిరకానివి కావడంతో ఎక్కడికక్కడ చిరిగిపోయి తెగిపడ్డాయి. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఏర్పా టు చేసిన టార్పాలిన్లు భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పించాయి. ఇక ఆలయం నుంచి బయట ప్రాంతంలో కూడా టెంట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.
గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం రూరల్: మండలం ఎం.తోటూరు వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎం. చిన్నంనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం ఎం.తోటూరు రైల్వే క్రాసింగ్ గేటు వద్ద రూరల్ ఎస్‌ఐ ఆర్.జనార్ధనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కేదారిపురం గ్రామానికి చెందిన భుక్త బలరాం, బింగి కుమార్‌ను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించారు. వీరి వద్ద నుంచి 2.100 కిలోల గంజాయి, రెండు మొబై ల్ ఫోన్‌లను స్వాఽధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన పత్రి కా సమావేశంలో సీఐ చిన్నంనాయుడు మాట్లాడుతూ గంజాయికి అలవాటుపడిన భుక్త బలరాం, బింగి కుమార్‌లు వారు పనిచేసే అచ్యుతాపురం పట్టణంలో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, అధిక ధరలకు అమ్ముకుంటుంటారని తెలిపారు. బరంపురానికి చెందిన గంజాయి వ్యాపారి నిలంచల వద్ద రూ.3వేలుకు రెండు కిలోలు కొనుగోలు చేసి అచ్యుతాపురం వెళ్లేందుకు ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో ఎల్‌సీ గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అండర్–18 బాలబాలికల బాస్కెట్ బాల్ ఎంపికలు రేపు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా అండర్–18 బాల బాలికల బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక ఈనెల 7వ తేదీ మంగళవారం జరుగుతుందని జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్‌ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కూడలి వద్దనున్న ఎన్‌టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఉన్న బాస్కెట్‌బాల్ సెలక్షన్ ట్రైన్స్ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి జరుగుతుందని తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు 18 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. డీఎస్సీ కోచ్ అర్జునరెడ్డి మాట్లాడుతూ ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు ఈ– సేవ సర్టిఫికెట్, రెండు పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలు, ఆధార్‌కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు 9949291288 సంప్రదించాలని ఆయన కోరారు.
రణస్థలంలో భారీ ట్రాఫిక్ జామ్
రణస్థలం: రణస్థలంలో జరుగుతున్న పై వంతెన పనులు వాహనదారులకు దినదిన గండంలా మారుతున్నాయి. అలాగే రోడ్డు దాటే ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం 9గంటల సమయంలో రామతీర్థాలు కూడలిలో ఉన్న భారీ స్పీడ్ బ్రేకర్ వల్ల అధిక లోడుతో వెళుతున్న లారీ వెనుక చక్రాల వద్ద కట్ ప్లేట్‌లు విరిగిపోయాయి.
దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రణస్థలం నుంచి యూబీ పరిశ్రమ వరకు వాహనాలు బారులు తీరాయి. రణస్థలం దాటేందుకు పక్కాగా రెండు గంటలు పట్టిందంటే ట్రాఫిక్ తీవ్రత ఎంత ఉందో తెలుస్తోంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు జేఆర్ పురం పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
గార: వత్సవలస రాజమ్మ తల్లి యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటో బోల్తా పడటంతో గాయాలపాలైన లుకలాపు వెంకటరమణ (45) చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. గార పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రేగిడి ఆమదాలవలస మండలం లంబకండి గ్రామానికి చెందిన మృతుడు వెంకటరమణతో పాటు గ్రామస్తులు ఆటోలో శనివారం వత్సవలస వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొర్ని గ్రామం మీదుగా వెళ్తుండగా మలుపు వద్ద ఆటో అదుపు తప్పడంతో బోల్తా పడగా, ఆటో కింద ఉండిపోవడంతో గాయాలపాలయ్యాడు. ముందుగా రిమ్స్‌లో చే ర్పించగా, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఉదయం మృతి చెందాడు. కుమారుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చోడిపల్లి గంగరాజు తెలిపారు.


