పాఠశాలల్లో 100 శాతం నమోదు లక్ష్యం: ముఖ్యమంత్రి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో 100 శాతం నమోదు లక్ష్యం: ముఖ్యమంత్రి

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

భువనేశ్వర్‌: కొత్త విద్యా సంవత్సరం ఆరంభం పురస్కరించుకుని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి శనివారం రాష్ట్ర స్థాయి పాఠశాల ప్రవేశం, అక్షరా భ్యాసం కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని, పిల్లల మనసుల్లో విద్య పట్ల ఆసక్తిని, అంకితభావాన్ని పెంపొందించాలని, పాఠశాలల్లో 100 శాతం నమోదు సాధించడం ఈ ఉత్సవం ఏకై క లక్ష్యంగా పేర్కొన్నారు. స్థానిక రాజ్‌ భవన్‌ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిన్నారులతో పలకపై బలపంతో అమ్మ, నాన్న పదాలను రాయించి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టించారు. ఈ సందర్భంగా నిపుణ్‌ ఒడిశా, పొఢిబా, గొడిబా ఒడిశా ప్రచార కార్యక్రమాలల కింద వివిధ పాఠశాలల్లో పిల్లల కోసం అభివృద్ధి చేసిన విషయ ఆధారిత విద్యా సామగ్రి ప్రదర్శనను సందర్శించారు. అనంతరం పిల్లలకు విద్యా సహాయక కిట్లను బహూకరించారు. కార్యక్రమంలో పిల్లలు ఏర్పాటు చేసిన చిత్రలేఖన స్టాల్‌ను సందర్శించి పిల్లలను ప్రశంసించారు. చిన్న పిల్లలు సైతం తాము స్వయంగా గీసిన చిత్రాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. కొత్త విద్యా విధానం ప్రకారం అంగన్‌వాడీలను దశలవారీగా శిశు వాటికలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జెండా ఊపి విద్యా అవగాహన రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద్‌ గోండ్‌, పలువురు ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

మల్కన్‌గిరిలో..

మల్కన్‌గిరి: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా మల్కన్‌గిరిలో అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఎంవీ 7 గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మడ్కమి హాజరై మాట్లాడారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలను విద్యావంతులు చేయాలన్నారు. సీఎం సంతకం చేసిన ప్రత్యేత ఆహ్వాన పత్రాలు, గులాబీ పువ్వులు, మిఠాయిలు, చాక్లెట్లు అందజేశారు.

విద్యతోనే వికాసం

రాయగడ: విద్యతోనే వికాసం సాధ్యమని, అంతా చదువుకోవాలని కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి అన్నారు. స్థానిక గాంధీనగర్‌లో గల ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో శనివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన పలకా–బలపం పట్టుకోండి అన్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అందరికీ ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా 25 మంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. కలెక్టర్‌ ఒడిలొ చిన్నారులు కూర్చుని ఓనమాలు దిద్దారు. అంతకు ముందు చదువుల తల్లి సరస్వతీ దేవికి పూజలను నిర్వహించారు. అనంతరం చైతన్య రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్‌ ప్రధాన్‌, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి శాంతిలత ముని, సస్మిత బౌరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement