పర్లాకిమిడి: వంశధార నదిపై నేరడి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వాయరు నిర్మాణంపై గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్‌లో ఖండవ పంచాయితీ సరా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశధారపై ట్రిబ్యునల్‌కు వెళ్లిన ఆంధ్ర ప్రభుత్వం శుక్రవారం తమకు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు నిచ్చిందని ప్రకటించడంతో గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్‌లో ఖండవ పంచాయితీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజి నిర్మాణం చేస్తే కాశీనగర్ బ్లాక్ ఖండవ పంచాయితీలో సరా గ్రామంలో 108 ఎకరాలు ముంపుకు గురవుతాయని జిల్లా పరిషత్ అధ్యక్షులు, న్యాయవాది గవర తిరుపతి రావు విలేకరులతో అన్నారు. గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్‌లో వరి, ఇతర వాణిజ్య పంటలు ఖరీఫ్, రబీ కోసం కోట్లాది రూపాయలతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండు మెగా ప్రాజెక్టులు నిర్మించింది. నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే ఈ మెగా ఎత్తిపోతల పథకాలు ఒట్టిపోయి కాశీనగర్ బ్లాక్‌లో పంట పొలాలు ఎండిపోతాయని ఆయన అన్నారు. 1962లో ఉభయ ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు వంశధార నదీ జలాల పంపకంపై ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఒడిషా, ఆంధ్ర రాష్ట్రాలు 50ః50 నిష్పత్తితో 117 టీఎంసీల వంశధార నదీ జలాలు వాడుకోవాలని నిర్ణయించారు. 2015లో వంశధారపై నదిపై ఆంధ్రప్రదేశ్ బ్యారేజీ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించకపోవడం వల్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకి వచ్చింది. తర్వాత ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హిరమండలం వద్ద రిజర్వాయర్ నిర్మించడానికి ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. అయితే వంశధార వద్ద నేరడి నుండి ఒక వీఆర్ కాలువ ద్వారా హిరమండలంకు సాగునీటిని తరలించారు. ప్రస్తుతం వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణం చేస్తే గజపతిజిల్లా కాశీనగర్ బ్లాక్ సరా గ్రామంలో 108 ఎకరాలు ముంపునకు గురికావడంతో పాటు, గుణుపురం ఎన్‌ఏసీ నదికి గ్రామం ఆనుకుని ఉండటంతో ఇసుక సిల్క్ అయ్యి గుణుపురం గ్రామం పూర్తిగా కనుమరుగై, కరువు కాటకాలు దారితీస్తుందని గవర తిరుపతి రావు అన్నారు. అంతేకాక వంశధార ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చేముందు గుణుపురం, గజపతివంశధార నదీ జలాల రైతుల కమిటీకి కనీసం తెలియజేయలేదని తిరుపతి రావు ఆరోపిస్తున్నారు. వంశధార ట్రిబ్యునల్ జడ్జిమెంట్‌పై సరా, బడిగాం గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. తమకు న్యాయం చేసి నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే సమీప భవిష్యత్‌లో రోడ్డుపై ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.


