కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాల సర్వజన ఆస్పత్రులలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్‌టీయూ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల నంబర్ 138 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూ.18,600 వేతనం ఇవ్వాల్సి ఉన్నా అంతమొత్తం చెల్లించడం లేదన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇష్టం లేకుంటే పని మానేయాలని చెబుతున్నారని వాపోయారు. కారణం చెప్పకుండానే కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు, వేలిముద్రలు తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడి క్రాంతి, ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, సభ్యురాలు కృష్ణవేణి, కార్యదర్శి దుమ్ము సింహాచలం, కన్వీనర్ చిన్నారావు, జయప్రద, తంగి ప్రభ, కొర్లకోట విజయ, ఆర్.జి.మాధవ, సాధు శ్రీనివాస్, చంద్రకళ, ఎల్లమ్మ, అప్పలనాయుడు, భాస్కరరావు, బాలసుందరం, శ్రీదేవి, భూదేవి, పోలమ్మ, కావ్య పాల్గొన్నారు.


