సాంకేతిక మార్పులకు అనుగుణంగా పరిశోధనలు
టెక్కలి: మారుతున్న కాలంతో పాటు సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులపై పరిశోధనలు చేయాలని విజయనగరం జేఎన్‌టీయూ డైరెక్టర్ జి.స్వామినాయుడు అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఐసీఈఎంటీఏ–25 పేరిట నిర్వహించిన రెండో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎమర్జింగ్ మెటీరియల్స్ ఫర్ టెక్నాలజికల్ అప్లికేషన్స్ ఇంటిగ్రేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులు ఇంజినీరింగ్ విద్యకు నూతన దిశలను చూపుతున్నాయన్నారు. ఎమర్జింగ్ మెటీరియల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తు టెక్నాలజీలకు బాటలు వేస్తున్నాయని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక నిపుణులు పాల్గొని తాజా పరిశోధనలు, అభివృద్ధి అంశాలు, ఏఐ డేటా సైన్స్ అన్వయాలు వంటి అంశాలపై 188 పత్రాలు అందగా అందులో 110 ఎంపిక చేసినట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ శ్రీరాములు, బి.వి.రమణ, టి.నరేష్, రత్నమణి, ఎం.రమణయ్య, జయంతి, సంతోషకుమార్ తదితరులు పాల్గొన్నారు.


