ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతిపై దర్యాప్తు
● ఆదేశించిన జిల్లా కలెక్టర్
● నలుగురితో కమిటీ ఏర్పాటు
రాయగడ: సదరు సమితి బాయిసింగి ఆశ్రమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న తాడింగి నందిని గత నెల 30వ తేదిన మలేరియా వ్యాధితో మృతి చెందిన ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఈ మేరకు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్, జిల్లా ఆరోగ్యశాఖకు చెందిన ఎస్‌డీహెచ్‌వో డాక్టర్ ప్రదీప్ కుమార్ సుబుద్ధి, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి ఉన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో తరచూ వివిధ కారణాల వల్ల విద్యార్థులు మృత్యు వాత పడుతుండటం పరిపాటిగా మారిందన్న ఆరోపణలపై స్పందించిన కలెక్టర్ కులకర్ణి బాయిసింగి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మలేరియా వ్యాధితో మృతి చెందిన ఘటనపై పూర్తి వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. దీంతో ఈ కమిటీ శనివారం బాయిసింగి ఆశ్రమ పాఠశాల, హాస్టల్‌ను సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. అలాగే ఆయా ప్రాంతాల పరిసరాలను పరిశీలించిన కమిటీ విద్యార్థిని ఉండే హాస్టల్ గదిని కూడా పరిశీలించారు. మృతురాలు ఎప్పటి నుంచి అస్వస్థతకు గురైంది, హాస్టల్ నిర్వాహకులు, సిబ్బంది ఎంతవరకు స్పందించి చర్యలు తీసుకున్నారన్న అంశంపై మెట్రీన్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని సొంత గ్రామమైన డంగాజోడిలో కూడా పర్యటించి బాధిత కుటుంబీకులతొ మాట్లాడిన కమిటీ వారి వివరాలు సేకరించారు. మలేరియా వ్యాధి సోకిన తరువాత నందినిని తమ ఇంటికి తీసుకువెళతామని అడిగినప్పటికీ హాస్టల్ సిబ్బంది అంగీకరించలేదని బాధిత కుటుంబీకులు దర్యాప్తు కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
